రెడ్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్ అమలు: కిషన్ రెడ్డి 

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 08:37 AM IST
రెడ్ జోన్లలో కఠినంగా లాక్‌డౌన్ అమలు: కిషన్ రెడ్డి 

రెడ్ జోన్లలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కేసుల ఆధారంగా ప్రాంతాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లు గా విభజించామని తెలిపారు. ఈ మేరకు ఆయన మే 2న మీడియాతో మాట్లాడుతూ కేసులు ఎక్కువగా ఉంటే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలో రెడ్ జోన్ లో 130 జిల్లాలు, ఆరెంజ్ జోన్ లో 284  జిల్లాలు, గ్రీన్ జోన్ లుగా 319 జిల్లాలను నిర్ణయించామని చెప్పారు. 

కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూలాంటి వాతావరణం ఉంటుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలు కంటైన్మైంట్ జోన్లలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజులతో పోల్చితే గత 24 గంటల్లో అత్యధికంగా 2 వేల 293 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కరోనా తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని పేర్కొన్నారు. 

ఆరెంజ్, గ్రీన్ జోనల్ల్లో కొన్ని ఆర్థిక కార్యక్రమాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ప్రైవేట్ సంస్థలు నిర్వహణకు కొంత వెసులుబాటు కల్పించామని చెప్పారు. జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు పని చేసుకోవాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదంలో పడతామని తెలిపారు. గతవారం రోజులుగా 80 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు.

21 రోజులుగా దేశంలో 41 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. గత 28 రోజుల్లో 26 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా 774 కరోనా అస్పత్రులు ఉన్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా 19 వేల 398 వెంటిలేటర్లను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. 2.22 కోట్ల పీపీఈ కిట్లకు అర్డర్ ఇచ్చామని తలిపారు. 1.43 లక్షల కిట్లను మన దేశంలోనే తయారు చేస్తారని చెప్పారు.

వలస కార్మికుల భోజనాల కోసం రాష్ట్రాలకు రూ.12 వేల కోట్ల ఇచ్చామని తెలిపారు. రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలకు ప్రత్యేక రైల్లు ఏర్పాటు చేశామన్నారు. వలస కార్మికులు వారి స్వస్థలాలకు పంపిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, టూరిస్టులను మాత్రమే తరలిస్తామని తేల్చి చెప్పారు. రైళ్లు ఎక్కేముందు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అనారోగ్యంగా ఉన్నవారిని ప్రభుత్వ క్వారంటైన్ కు తరలిస్తామని చెప్పారు.