2017లో 80 కిలోల గంజాయిని పట్టుకున్నారు..ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్లారు

  • Published By: madhu ,Published On : May 1, 2020 / 02:12 AM IST
2017లో 80 కిలోల గంజాయిని పట్టుకున్నారు..ఇప్పుడు దొంగలు ఎత్తుకెళ్లారు

దొంగలు ఎత్తుకెళ్లింది..పోలీసులు స్వాధీనం చేసుకోవడం..మరలా దొంగల పాలు కావడం ఎప్పుడైనా విన్నారా. అవును కొన్ని కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. పోలీసుల కళ్లుగప్పి తస్కరిస్తుంటారు. తమ చోరకళను ప్రదర్శిస్తుంటారు. దీంతో మరలా ఆ సొత్తును పట్టుకోవడానికి పోలీసులు చెమటోడాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మూడు సంవత్సరాల కిందట పట్టుకున్న గంజాయిని ఇప్పుడు ఎత్తుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

2017లో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు..రైళ్లో రవాణా చేస్తున్న 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిని బోయిగూడ రైల్వే కోర్టు ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో భద్రపరిచారు. అప్పటి నుంచి గంజాయి అక్కడనే ఉంది. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం పర్యవేక్షణలో భాగంగా ఓ కానిస్టేబుల్ గంజాయి భద్రపరిచిన ప్రాంతానికి వెళ్లారు. 

కానీ అక్కడ ఉండాల్సిన గంజాయి కనిపించలేదు. దీంతో ఆ కానిస్టేబుల్ అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. గంజాయిని గుర్తు తెలియని వ్యక్తులు అపహకరించారని పోలీసులు నిర్ధారించారు. చోరీ అయినట్లుగా రైల్వే సీఐ ఆదిరెడ్డి ఫిర్యాదు చేశారు. మరి ఈ గంజాయిని ఎవరు ఎత్తుకెళ్లారు ? అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది. (అందరి చూపు మే 03 : ఇటలీ తరహాలో లాక్ డౌన్ ఎత్తివేత!)