Annavaram : పేదల పెళ్ళికి పెద్ద వేదిక….సత్యదేవుని సన్నిధిలో రూపాయి ఖర్చులేకుండా పెళ్ళి వేడుక

రానున్న శ్రావణ మాసంలో వివాహాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో అన్నవరం కళ్యాణ మండపంలో వివాహం చేసుకోవాలనుకునే వారు ముందుగానే బుకింగ్ చేసుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.

10TV Telugu News

Annavaram : పెళ్ళి చేసి చూడు…ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు…ప్రస్తుత పరిస్ధితిల్లో పిల్లల పెళ్ళి వేడుక జరిపించటం తల్లిదండ్రులకు పెద్ద భారంగా మారింది. కళ్యాణ మండపం మొదలు డెకరేషన్ ఇతరత్రా సౌకర్యాల వరకు అంతా ఖర్చుతో కూడుకున్నది కావటంతో పెళ్ళివేడుకను జరిపించేందుకు ఎన్నో వ్యయప్రయాసలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సామాన్యులు, పేద వర్గాలకు చెందిన వారు వివాహ వేడుకల విషయానికి వస్తే సమీపంలోని ఏగుళ్ళోనో, ఇంటిముందో పందిరి వేసో తక్కువ ఖర్చుతో తమకున్న దాంట్లో పెళ్ళితంతు జరిపించేస్తుంటారు. ఈ నేపధ్యంలోనే అలాంటి వారికోసం ఒక్క రూపాయి ఖర్చులేకుండా పెళ్ళివేడుకను అంగరంగవైభవంగా జరుపుకునేందుకకు అన్నవరం సత్యన్నారాయణ స్వామి దేవస్ధానం సన్నిధిలోని కళ్యాణమండపం అహ్వానం పలుకుతుంది.

4కోట్ల రూపాయల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ తో అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సత్య శ్రీనివాస కళ్యాణమండపాన్ని నిర్మించారు. ఈ కళ్యాణ మండపాన్ని కొద్దిరోజుల క్రితం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఒకే సారి 12 జంటలు వివాహాలు చేసుకునేందుకు వీలుగా కళ్యాణమండపంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డ 12 మండపాలను ఏర్పాటు చేశారు. ఈ మండపాల్లో పెళ్ళి వేడుకకు కావాల్సిన పెండ్లిపీటలు మొదలు, పాదుకలు,జంఖానా, కుర్చీలు, పాత్రలను  సమకూరుస్తారు.

కళ్యాణమండప నిర్మాణానికి లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాసరావు 4కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళంతోనే అన్నవరం దేవస్ధానం అధికారులు దీనిని పూర్తిచేశారు. పెళ్ళి మండపంలో  పెళ్ళివేదిక వద్ద ఉపయోగించే వస్తువులను కొన్నింటిని పూర్తికాలం వినియోగించుకునేలా దాత శ్రీనివాసరావు కొనుగోలు చేసి సమకూర్చారు.

శ్రావణ మాసం పెళ్ళి ముహర్తాలకు…బుకింగ్స్

రానున్న శ్రావణ మాసంలో వివాహాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో అన్నవరం కళ్యాణ మండపంలో వివాహం చేసుకోవాలనుకునే వారు ముందుగానే బుకింగ్ చేసుకునేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. వివాహానికి సంబంధించిన లగ్నపత్రిక, వధువరుల అధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల అధార్ వివరాలను సీఆర్ వో కార్యాలయంలో అందించి ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దేవాలయ అధికారులు వాటిని పరిశీలించి కళ్యాణ వేదికలో వేడుక నిర్వహించుకునే మండపం నెంబర్ ను కేటాయిస్తారు. ముహుర్తాసమయానికి ముందుగా ఆటోకెన్ నెంబర్ ను కళ్యాణ వేదిక వద్ద చూపిస్తే అవసరమైన వివాహ సామాగ్రిని అధికారులు అందిస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడ ఒక్క రూపాయి డబ్బు కూడా తీసుకోరు. కళ్యాణ మండపం కేటాయింపు మొదలు, వస్తుసామాగ్రి ఇచ్చే వరకు అంతా ఉచితమేనని ఆలయ అధికారులు తెలిపారు.

10TV Telugu News