ఇంటర్నేషనల్ కేడీలు : నకిలీ పాస్ పోర్టు, వీసా ముఠా అరెస్టు 

  • Published By: chvmurthy ,Published On : February 19, 2019 / 05:47 AM IST
ఇంటర్నేషనల్ కేడీలు : నకిలీ పాస్ పోర్టు, వీసా ముఠా అరెస్టు 

హైదరాబాద్ : పాస్ పోర్టు, వీసాల్లో అక్రమాలకు పాల్పడుతూ నకిలీ  పాస్ పోర్టులు, వీసాలు తయారుచేస్తున్న కన్సల్టెన్సీ పై  హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నకిలీ పాస్‌పోర్టులు ముద్రిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 100 పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు, 130 నకిలీ రబ్బర్‌ స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

సోమవారం చేసిన దాడుల్లో 88 భారత పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. కన్సల్టెన్సీ ముఠాపై ఇప్పటికే ఆరు కేసులున్నట్లు పేర్కొన్నారు. అబ్దుల్‌ రహీముద్దీన్‌ అనే వ్యక్తి అక్రమంగా కన్సల్టెన్సీ ఏజెన్సీని ఏర్పాటు చేశారని సీపీ చెప్పారు. ముఠాలోని ఇద్దురు గతంలో ఇదే తరహా నేరాలు చేసి జైలుశిక్ష అనుభవించారు.  ఈ ముఠా గత రెండేళ్ళలో  450 మందిని కెనడా,యూఏఈ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐరోపా దేశాలకు పంపించారు.  

అక్రమపద్దతుల్లో విదేశాలకు వెళ్ళాలనుకునేవారికి  ఎప్పటికైనా శిక్ష తప్పదని సీపీ అంజనీ కుమార్  చెప్పారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు  తప్పనిసరిగా ఆయాదేశాల కార్యాలయాలు, కాన్సులేట్ల వెబ్ సైట్లు చూడాలని ఆయన సూచించారు.  దేశ వ్యాప్తంగా  కేంద్ర ప్రభుత్వం  గుర్తించిన వీసా కన్సల్టెన్సీ సంస్ధలు రాష్ట్రంలో 59 మాత్రమే ఉన్నాయని టాస్క్ ఫోర్స్ డీసీపీ తెలిపారు.