MLA Akhil Gogoi: జైలు నుండే ఎమ్మెల్యేగా గెలుపు.. ఇప్పుడు బయటకొచ్చి ప్రమాణ స్వీకారం!

అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు జైల్లో ఉండగా పోటీచేసి గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. ఆ ప్రజా తీర్పునే కోర్టులో కూడా సాక్ష్యంగా చూపి హీరో బయటకొస్తాడు. అస్సాంలో ఓ ఎమ్మెల్యే కూడా అలానే గెలిచారు. అయితే.. ఇక్కడ జైలు నుండి బయటకి రావడానికి ప్రజా తీర్పు సాక్ష్యం సరిపోదు.

MLA Akhil Gogoi: జైలు నుండే ఎమ్మెల్యేగా గెలుపు.. ఇప్పుడు బయటకొచ్చి ప్రమాణ స్వీకారం!

Akhil Gogoi Win As An Mla From Jail Now Come Out And Take Oath

MLA Akhil Gogoi: అసెంబ్లీ రౌడీ సినిమాలో మోహన్ బాబు జైల్లో ఉండగా పోటీచేసి గెలిచి ఎమ్మెల్యే అవుతాడు. ఆ ప్రజా తీర్పునే కోర్టులో కూడా సాక్ష్యంగా చూపి హీరో బయటకొస్తాడు. అస్సాంలో ఓ ఎమ్మెల్యే కూడా అలానే గెలిచారు. అయితే.. ఇక్కడ జైలు నుండి బయటకి రావడానికి ప్రజా తీర్పు సాక్ష్యం సరిపోదు. ఆయన జైల్లో నుండే పోటీ చేయగా బయట ఆయన తరపున బంధువులు, అనుచరులు ప్రచారం చేశారు. అభ్యర్థి ప్రచారం చేయకపోయినా ప్రత్యర్థి మీద 11 వేలకు పైగా మెజార్టీతో గెలిచి తాజాగా జైలు నుండి బయటకొచ్చి ప్రమాణస్వీకారం చేసి మళ్ళీ తిరిగి జైలుకెళ్లాడు.

సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం, ఇత‌ర అభియోగాల కింద 2019లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అయితే, అఖిల్ జైలు నుంచే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసోం అసెంబ్లీ ఎన్నికల్లోనే సరికొత్త చరిత్ర నమోదు చేసిన సంగతి తెలిసిందే. శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అఖిల్ గొగోయ్ ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

ప్ర‌స్తుతం అఖిల్ గొగోయ్ జైలులోనే ఉండగా బెయిల్ ఇంకా మంజూరు కాలేదు. అయితే, శుక్రవారం అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో సహా 126 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో అఖిల్ గొగోయ్ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా భద్రతా సిబ్బంది ఆయన్ను జైలు నుండి సభకు తీసుకొచ్చారు. అఖిల్ ప్రమాణస్వీకారం అనంతరం మీడియా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుకు అనుమతి ఇవ్వలేదు. అయితే, ఏది ఏమైనా ఇలా జైలు నుండి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అఖిల్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు.