బీహార్ లోనే కాదు: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ : మంత్రి ప్రతాప్ సారంగి

  • Published By: nagamani ,Published On : October 26, 2020 / 04:45 PM IST
బీహార్ లోనే కాదు: దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ : మంత్రి  ప్రతాప్ సారంగి

get free COVID-19 vaccine : ‘మా పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా ఇప్పిస్తాం’ అని బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ హామీ ఇచ్చిన విషయం..పలు పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ లబ్ది కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే పార్టిపై తీవ్ర దూమారం చెలరేగి విమర్శలు వెల్లువెత్తటంతో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.


కరోనా టీకా బీహార్‌కు మాత్రమే కాదు..దేశ ప్రజలందరికీ ఉచితంగా అందజేస్తామని కేంద్రమంత్రి ప్రతాప్ సారంగి వెల్లడించారు. ఒడిశాలోని బాలసోర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఈ ప్రకటన చేశారు. ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇలా ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన ఇవ్వాలంటే ప్రతీ మనిషికి దాదాపు రూ.500 ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు తెలిపారు.


అక్టోబర్ 20న ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత శాస్త్రవేత్తలు పలు వ్యాక్సిన్‌లను అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు. అవి ప్రస్తుతం వివిధ క్లినికల్ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. వాటి ఫలితాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.


కాగా..బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార పీఠాన్ని దక్కించుకోవటానికి ఆయా పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్న క్రమంలో బీజేపీ మేనిఫెస్టో ప్రకటనలో బీహార్ లో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చింది.


దీంతో దేశవ్యాప్తంగా పలు పార్టీలు బీజేపీ హామీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఈ హామీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్ కూడా ఈ హామీ తుచ్..అని కేవలం రాజకీయ లబ్ది కోసమే బీజేపీ ఇటువంటి హామీలు గుప్పిస్తోందని ఎద్దేవా చేశారు.


మరోవైపు తమిళనాడు, మధ్యప్రదేశ్, అస్సాంలు తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందివ్వనున్నట్టు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం.. దేశంలో ప్రలందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుని దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తానని వెల్లడించింది.