గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

72 nd Republic Day celebrations : రిపబ్లిక్‌ డే వేడుకలకు సర్వం సిద్ధమైంది. కరోనా వదిలిపోతున్న సమయంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలు కావడంతో.. దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఆర్మీ దళాల విన్యాసాలు, శకటాల ప్రదర్శన హైలెట్‌గా నిలవనున్నాయి. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఒక దేశపు రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున రిపబ్లిక్‌ డేను జరుపుకుంటారు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి మనం రిపబ్లిక్ డేను జాతీయ పండుగగా జరుపుకుంటున్నాము. ఇలా చాలా దేశాలకు రిపబ్లిక్‌ డేలు ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగాధినేతలు జాతీయ జెండాను అధికారికంగా ఎగురవేస్తారు.

కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత జరుగుతున్న గణతంత్ర వేడుకలు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రాజ్ పథ్ వైపే ఉంది. రాజ్‌పథ్‌లో అదిరిపోయే షో చేసేందుకు ఇండియన్ ఆర్మీ రెడీ అవుతోంది. ఆర్మీ జరిపిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. ఇండియా గేట్, వార్ మెమోరియల్, ఇతర ప్రాంతాల్లో ఆర్మీ దళాల రిహార్సల్స్ జరిగాయి. ఎక్కడా ఎలాంటి సమస్యా లేదని ఆర్మీ తెలిపింది. అటు ఢిల్లీ పోలీసులు కూడా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా… ఇండియా గేట్ నుంచి హైవే వైపు వెళ్లే వాహనాల మార్గాలను మూసివేశారు.

ఈసారి గణతంత్ర వేడుకల్లో రాఫెల్ యుద్ధ విమానాన్ని ప్రదర్శించనున్నారు. గతేడాది ఇవి ఇండియన్ ఆర్మీలో చేరాయి. వీటిని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశారు. రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఒక రాఫెల్‌ యుద్ధ విమానం ‘వర్టికల్‌ ఛార్లీ’ విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం వెల్లడించింది. వర్టికల్‌ ఛార్లీ ఫార్మేషన్‌లో యుద్ధవిమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈ సారి గణతంత్ర వేడుకల్లో వాయుసేనకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వైమానిక దళం తెలిపింది.

దీంతో పాటు పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టం, BMP-2, T-90 భీష్మ ట్యాంక్, బ్రిడ్జ్ లేయర్ ట్యాంక్‌ను రిహార్సల్స్ లో ప్రదర్శించారు. బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్స్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామగ్రిని కూడా ప్రదర్శించారు. ఈ ఎక్సర్‌సైజులో ఇండియన్ ఆర్మీ అప్‌గ్రేడ్ చేసిన సిలికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ షో అదిరిపోయింది. ఈసారి వేడుకల్లో సైనిక విన్యాసాలు.. ఆర్మీ బ్యాండ్ కనువిందు చేయనుంది.

కరోనా కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో కేంద్రం పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీక్షకుల సంఖ్యను తగ్గించడంతో పాటు భౌతిక దూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా , పరేడ్ దూరాన్ని కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.