Allahabad HC : బనియన్​ వేసుకుని.. ఫేస్​ ప్యాక్​ లతో వర్చువల్​ వాదనల్లో అడ్వకేట్లు : మండిపడ్డ హైకోర్టు

వర్చువల్ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ బనియన్ వేసుకుని షర్టు వేసుకోకుండానే వాదనలో పాల్గొన్నారు. మరొక లాయర్ ఫేస్ ప్యాక్ వేసుకుని న్యాయమూర్తి ముందు దర్శనమిచ్చారు. మరోలాయర్ స్కూటర్ మీద వెళుతూ వాదనలు వినిపించారు. ఇలా నిబద్ధత లేకుండా వ్యవహరిస్తున్న అడ్వకేట్లపై హైకోర్టు మండిపడింది.

Allahabad HC : బనియన్​ వేసుకుని.. ఫేస్​ ప్యాక్​ లతో వర్చువల్​ వాదనల్లో అడ్వకేట్లు : మండిపడ్డ హైకోర్టు

Allahabad Hc

Allahabad High Court Dress Code For Advocates : కరోనా పుణ్యమాని కోర్టుల్లో వాదనలు వర్చువల్ విధానంలో జరుగుతున్న క్రమంలో కొంతమంది లాయర్లు వ్యవహరించే తీరు న్యాయస్థానాలను అగౌరపరిచేవిధంగా ఉంది. కొంతమంది మంచంమీద పడుకుని కేసుల విచారణల్లో పాల్గొంటే మరొకరు సిగిరెట్ తాగుతూ కనిపిస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. ఈక్రమంలో వర్చువల్ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ బనియన్ వేసుకుని షర్టు వేసుకోకుండానే వాదనలో పాల్గొన్నారు. అలాగే మరొక లాయర్ ఫేస్ ప్యాక్ వేసుకుని న్యాయమూర్తి ముందు దర్శనమిచ్చారు. మరోలాయర్ మరో అడుగు ముందుకు వేసి స్కూటర్ మీద వెళుతూ వాదనలు వినిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ అడ్వకేట్లకు అసలు న్యాయస్థానం మీద గౌరవం ఉందా?అనిపిస్తోంది.

దీనిపై లాయర్లు తీరుపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. న్యాయవాదుల తీరుపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘అడ్వొకేట్లకు న్యాయస్థానంమీద గౌరవ ఉండక్కర్లేదా? ఏంటీతీరు? కేసుల విచారణలకు వచ్చే పద్ధతి ఇదేనా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఇటువంటి ప్రవర్తన ఎంతమాత్రం సరికాదు. ఇంట్లో ఉన్నా.. ఆఫీసులో ఉన్నా లేదా కోర్టు రూంలో ఆన్ లైన్ విచారణలకు హాజరైనా పద్ధతి పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. లాయర్లు నిబద్ధతతో వ్యవహరించాల్సిందే. కోర్టుకు వచ్చేటప్పుడు ఎలాగైతే డ్రెస్ కోడ్ తో వస్తారో అలాగే ఆన్ లైన్ విచారణలకు కూడా హాజరు అవ్వాలి. క్రమశిక్షణను పాటించాలి’’ అంటూ జడ్జి ఆయా లాయర్లకు ముక్క చీవాట్లు పెట్టారు.

ఆన్ లైన్ లో విచారణలకు హాజరయ్యేటప్పుడు కచ్చితంగా ఫార్మల్ దుస్తులనే ధరించాలని ఆదేశించారు. వైట్ షర్టు లేదా తెల్ల సల్వార్ కమీజ్ అదే మహిళా అడ్వకేట్లయితే చీర, తెల్లటి నెక్ బ్యాండ్ తో విచారణకు హాజరు కావాలని.. ఆదేశాలిచ్చారు. బ్లాక్ కోటు ధరిస్తే అసలైన డ్రెస్ కోడ్ పాటించినట్లుగా ఉంటుందని..వీటిని తప్పనిసరిగా పాటించి తీరాల్సిందేనని లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హుకుం జారీ చేశారు.

కేసుల విచారణలు జరిగేటప్పుడు కోర్టులో ఎలా ఉంటారో అలా నిబద్ధతతో ఉండాలని సూచించారు. లేదా కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి అయితే విచారణ జరిగే సమయాల్లో అడ్వకేట్లుఉన్న ప్రాంతంలో ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మరో సందర్భాన్ని గురించి చెబుతూ..ఓ అడ్వకేట్ ఏకంగా రంగుల పూలచొక్కా వేసుకుని విచారణలో పాల్గొన్నారు. అది చూసి అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ అడ్వకేట్ ఏ మాత్రం పట్టించుకోలేదు…ఇటువంటివారికి న్యాయస్థానాలమీద గౌరవం ఉంటుందని ఎలా అనుకోవాలి? ఇదేనా పద్ధతి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇకనుంచి ఎవరైనా క్రమశిక్షణ లేకుండా క్యాజువల్ గా వస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై అడ్వొకేట్లందరికీ హైకోర్టు బార్ అసోసియేషన్ సూచనలివ్వాలని న్యాయమూర్తి సూచించారు.