చంద్రబాబుకు నోటీసులు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది?

చంద్రబాబుకు నోటీసులు.. ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది?

Amaravati Land Scam Cid Issues Notice To Tdp Chief Chandrababu

మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి రెండు బృందాలుగా చేరుకున్న సీఐడీ అధికారులు.. నోటీసులు అందించారు. AP CRDA ఛైర్మన్ హోదాలో అసైన్డ్‌ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చారంటూ చంద్రబాబుపై కేసు నమోదైంది.

దళితులకు కేటాయించిన భూములు రాజధాని ప్రకటనకు ముందే ఇతరులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూసమీకరణ ప్రకటించిన తర్వాత కేబినెట్ అనుమతి లేకుండానే బదలాయింపుకు అనుమతించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 5వందల ఎకరాల అసైన్డ్‌ భూముల కొనుగోళ్లను వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో టీడీపీ సర్కార్ క్రమబద్దీకరించినట్లు కేసు నమోదైంది. అధికారుల అభ్యంతరాలు, సూచనలు పట్టించుకోకుండా చైర్మన్ హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపైనే ఆయనకు నోటీసులు ఇచ్చారు.

Cbn (1) (1)

చంద్రబాబుతో పాటు మాజీమంత్రి నారాయణ కూడా నోటీసులు అందించారు. 41 సీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చామని ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్ చెప్పారు. ఈనెల 23న విచారణకు రావాలని చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఆయనపై 120B, 166, 167, 217 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కూడా కేసు నమోదైంది. చాలా రోజులుగా అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై రాద్దాంతం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం హైకోర్టు విచారణలో ఉంది.

చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన కేసులో FIRకాపీ టెన్‌టీవీ చేతిలో ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ప్రధాన అనుమానితులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అప్పటి మంత్రి నారాయణను పేర్కొన్నారు. తమను కొందరు మోసం చేశారంటూ అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తనను ఆశ్రయించారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు తమను మోసం చేశారని అక్రమంగా తమ భూమలును తీసుకున్నారని తనకు చెప్పినట్లు ఆళ్ల ఫిర్యాదులో చెప్పారు. తమ భూములపై అభద్రతాభావం కల్పించి తమను గందరగోళానికి గురిచేసి భూమలు లాక్కున్నారని… ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం భూములు లాక్కుంటుందని.. ఈ కుట్రలో భాగమైన కొందరు మధ్యవర్తులు రైతులను బెదరగొట్టారని ఇందులో చెప్పుకొచ్చారు.

దీంతో ప్రభుత్వ జీవోలను అధ్యయనం చేశామని… చాలా అక్రమాలు జరిగాయని, ఎస్టీ-ఎస్టీ రైతులకు చాలా అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు ఆళ్ల. ఆళ్ల ఫిర్యాదుతో ఏపీ సీఐడీ విచారణ జరిపింది. మార్చి 12న ప్రాథమిక నివేదిక ఉన్నతాధికారులకు చేరింది. అందులో పలు అక్రమాల్ని గుర్తించినట్లు తేలింది. సీఐడీ అడిషనల్‌ డీజీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు.

Cbn