America Vaccination: లక్షల వ్యాక్సిన్ డోసులను వెనక్కు పంపిస్తున్న రాష్ట్రాలు

మన దగ్గర వ్యాక్సినేషన్ పరిస్థితి గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాల్సిన పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వేయించుకోండి మహా ప్రభో అని సెలబ్రిటీల చేత.. మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్ గా ప్రభుత్వం ప్రచారం చేసినా ఆమ్మో మాకు భయం అంటూ మొన్నటి దాకా వెనక్కు తగ్గారు.

America Vaccination: లక్షల వ్యాక్సిన్ డోసులను వెనక్కు పంపిస్తున్న రాష్ట్రాలు

America Vaccination

America Vaccination: మన దగ్గర వ్యాక్సినేషన్ పరిస్థితి గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాల్సిన పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వేయించుకోండి మహా ప్రభో అని సెలబ్రిటీల చేత.. మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్ గా ప్రభుత్వం ప్రచారం చేసినా ఆమ్మో మాకు భయం అంటూ మొన్నటి దాకా వెనక్కు తగ్గారు. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి రెండో దశ విరుచుపడి రోజుకి వేల మందికి బలి తీసుకుంటుంటే వ్యాక్సిన్ మాకు మాకు అని వెంటపడుతున్నారు. కానీ.. అందుకు సరిపడా వ్యాక్సిన్లు లేవు. మాకు ఆర్డర్స్ లేకనే మేము వ్యాక్సిన్ డోసులు పెద్ద సంఖ్యలో తయారు చేయలేదని సీరం ఇన్సిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా చెప్పారంటే మన ప్రభుత్వం ఆ విషయాన్ని ఎంత తేలికగా తీసుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

కానీ, అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి వేరు. ఒక్క అమెరికా మాత్రమే కాదు. ధ‌నిక దేశాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 83 శాతం మందికి వ్యాక్సిన్లు అందాయి. అమెరికా అధినేత బైడెన్ ఈ నెల చివరి నాటికి మాస్క్ లేని అమెరికాను టార్గెట్ గా పెట్టుకొని ముందుకు వెళ్లారు. ఫలితంగా ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాకు వ్యాక్సిన్ మిగిలిపోయాయని వెనక్కు పంపుతున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌కు కేటాయించిన మొత్తం 1,62,680 డోసుల్లో త‌మ‌కు కేవ‌లం 8 శాతం మాత్ర‌మే చాల‌ని విస్కాన్సిన్ రాష్ట్రం చెప్పిందంటే వ్యాక్సిన్ల‌కు డిమాండ్ ఏమేర ప‌డిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు. అయోవా 29 శాతం, ఇలినాయిస్ 9 శాతం చాల‌ని చెప్పేయగా ఉత్త‌ర క‌రోలినా, ద‌క్షిణ క‌రోలినా, వాషింగ్ట‌న్ స్టేట్‌, క‌నెక్టిక‌ట్ రాష్ట్రాలు కూడా త‌మ‌కు అన్ని వ్యాక్సిన్ డోసులు అవ‌స‌రం లేద‌ని ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వానికి చెబుతున్నాయి.

దేశం మొత్తం మీద న్యూయార్క్ సిటీ, మేరీల్యాండ్‌, కొల‌రాడోలాంటి రాష్ట్రాలలో మాత్రమే ఇంకా అనుకున్న టార్గెట్ చేరుకోలేదు. అందుకే అక్కడ ఇక నుండి అవ‌స‌ర‌మైతే ప్ర‌తి ఇంటికీ వెళ్లి వ్యాక్సినేషన్ ఇవ్వాల‌నే ప్రపోజల్ కూడా ఆలోచనలో ఉంది. ఈ కొద్ది రాష్ట్రాలలో వ్యాక్సిన్ ప్రజలకు చేరువ చేయగలిగితే అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. ఇప్పటికే మిగిలిపోతున్న వ్యాక్సిన్లు కాకుండా ఈ నెల చివరి నాటికి లక్షల డోసుల వ్యాక్సిన్లు అక్కడ మిగిలిపోనున్నాయి. వీటన్నంటినీ ఇండియాలాంటి దేశాలకు ఇవ్వాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ధనిక దేశాల్లో 83 శాతం వ్యాక్సినేషన్ జరిగితే పేద దేశాలలో కేవలం 0.3 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగిందంటే ఎంతటి వ్యత్యాసాలు ఉన్నాయో.. ఈ వ్యాక్సిన్ అసమానతలు తీరేది ఎప్పటికో మరి!