అంపన్ తుపాన్ : పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం

  • Published By: madhu ,Published On : May 20, 2020 / 01:02 AM IST
అంపన్ తుపాన్ : పశ్చిమ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాలపై ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రచండ తపాను అంపన్‌.. అత్యంత తీవ్ర తుపానుగా మారింది. 2020, మే 20వ తేదీ బుధవారం అతితీవ్ర తుఫాన్‌గా మారనుంది. మధ్యాహ్నం అంపన్‌ తుపాను  తీరం దాటనుంది. మంగళవారం మధ్యాహ్నానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం గుండా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరాలవైపు వేగంగా కదులుతున్నట్టు ఐఎండీ తెలిపింది. బుధవారం సాయంత్రానికి బంగ్లాదేశ్‌-పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లోని దిఘా -హైతీ దీవుల మధ్య… సుందర్‌బన్స్‌ వద్ద తీరం దాటే అవకాశం ఉంది.

అంపన్‌ తుపాను ప్రభావం ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంపై పడనుంది. అటు ఒడిసా రాష్ట్రంపైనా ఉండనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఇప్పటికే 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించగా, మొత్తం 14 లక్షల మందిని తరలించాల్సి ఉన్నట్లు భావిస్తున్నారు.  ఇక అంపన్‌ తుపాను  తీరం దాటే సమయానికి గాలులు గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగం పుంజుకునే అవకాశముంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. 

అంపన్‌ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో గాలుల ఉధృతి ఎక్కువగా ఉంది. సముద్రంలో అలల తీవ్రత పెరిగింది. సోంపేటలోని బారువతీరంతో పాటు పలుచోట్ల సముద్రం 300 అడుగుల ముందుకు వచ్చింది. హిరమండలంలోని వంశధారలో వరదనీటి ప్రవాహం పెరిగింది. గొట్టాబ్యారేజీ దగ్గర గర్భంలో ఉన్న నీటిని 7 గేట్లు ఎత్తివేసి దిగువకు  విడిచిపెట్టారు.  తుపాను విషయంలో భయం వద్దని కేంద్రం రెండు రాష్ట్రాలకు భరోసా ఇచ్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇరు రాష్ట్రాల సీఎంలు మమతాబెనర్జీ, నవీన్‌పట్నాయక్‌కు ఫోన్‌ చేశారు.

కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని.. సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న పెనుతుపాను అంపన్‌ తీవ్రతకు.. తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది.  పెను తుపాను ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రెండు దశాబ్దాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతిపెద్ద సూపర్‌ సైక్లోన్‌గా అంపన్‌ను నిపుణులు అభివర్ణిస్తున్నారు. పెనుతుపాను వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది.  గంటకు 210 నుంచి 240 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఏపీలోని  సముద్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 20 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం సూచించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నంలో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Read:అత్యంత తీవ్రమైనదిగా మారుతున్న ఆంఫన్ తుఫాన్