ఇలాంటి వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆనంద్ మహీంద్రాకు పిచ్చకోపం తెప్పించిన ప్రయాణికుడు

ఇలాంటి వారి వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయి, ఆనంద్ మహీంద్రాకు పిచ్చకోపం తెప్పించిన ప్రయాణికుడు

Anand Mahindra Deserve Any Applause: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అతికొద్ది మంది వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్‌ మహీంద్రా ఒకరు. లక్షల సంఖ్యలో ఉద్యోగులు, రూ.కోట్ల టర్నోవర్‌ కంపెనీని నడిపించడం, వీటన్నింటి మధ్యలోనూ నెటింట్లో సందడి చేస్తుంటారీ వ్యాపార దిగ్గజం. తన దృష్టికి వచ్చిన, తనకు నచ్చిన వివిధ అంశాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు మహీంద్రా.

కేవలం సరదాగా ట్వీట్లు చేయడమే కాదు అప్పుడప్పుడు సమాజానికి అవసరమయ్యే, సమాజంలో విలువలను గుర్తు చేసే పోస్టులను సైతం చేస్తుంటారాయన. ఆయన చేసే పోస్టుల్లో కొన్ని స్ఫూర్తిని నింపేవి, ప్రేరణ కలిగించేవి ఉంటాయి. అదే సమయంలో తప్పులను, లోపాలను ఎత్తిచూపేవీ ఉంటాయి. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనాలను ప్రశ్నించేలా, ఆలోచింపజేసేలా, వారి బాధ్యతను గుర్తు చేసేలా ఉంది.

తాజాగా మహీంద్రా ఓ ఫొటోను షేర్ చేసి, “ఇటీవలి కాలంలో ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరగడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇలాంటి ప్రయత్నాలు ఎంతమాత్రం అభినందనీయం కాదు’’ అని కామెంట్ పెట్టారు. ఓ వైపు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న వేళ.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టే మాస్క్‌ను ముక్కు, నోటికి కాకుండా కళ్లకు పెట్టుకుని లోక్‌ల్ ట్రైన్‌లో ప్రయాణించాడో వ్యక్తి. ఆ ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన మహీంద్రా.. సదరు వ్యక్తిపై సీరియస్ అయ్యాడు.

ఈ పిక్ ఓ రైల్లో తీసింది. మాస్క్ వేసుకోకుండా బయటకు రావద్దంటున్న ఆరోగ్య శాఖ అధికారుల సూచనలను అతను పాటించాడు. కానీ, మాస్క్ ను ముక్కు, మూతికి ధరించలేదు. దర్జాగా సీటులో కూర్చుని, మాస్క్ తో కళ్లు కప్పుకుని కునుకు తీస్తున్నాడు. అతడు వెరైటీ కోసం ఇలా చేశాడో మరో కారణమో కానీ.. అడ్డంగా బుక్కయ్యాడు. ఆనంద్ మహీంద్రాకు కోపం తెప్పించాడు.

కొంతకాలంగా మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు సగం కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు పెట్టుకునేలా మార్షల్స్‌ను నియమించింది. రాష్ట్ర ప్రజలు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేదంటే మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టాల్సి వస్తుందని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్ కూడా ఇచ్చారు.

కరోనా వ్యాక్సిన్ వచ్చినా.. ముప్పు తప్పలేదనే విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. బయటకు వెళ్తే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కరోనా కాటేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం.