పార్ధీవదేహాన్ని రోడ్డుమీదే వదిలివెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ సస్పెండ్

పార్ధీవదేహాన్ని రోడ్డుమీదే వదిలివెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ సస్పెండ్

Covid

COVID patient’s body on road:కృష్ణా జిల్లాలోని ఒక గ్రామ శివార్లలో కోవిడ్ రోగి మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ రోడ్డుమీదనే వదిలిపెట్టడాన్ని యావత్ ప్రజానీకాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది.



ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. మానవత్వం లేకుండా మృతదేహాన్ని రోడ్డు మీదనే వదిలివేయడం దారుణమని ఘటనకు కారణమైన డ్రైవర్ ను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించింది. కాగా కృష్ణా జిల్లా తిరువూర్ మండలంలోని మునుకుల్లా గ్రామానికి చెందిన షేక్ సుభానీ (40) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం అతనికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా ఉన్నట్లు తేలింది.



ఈ క్రమంలో అతని పరిస్థితి విషమంగా ఉండడంతో సుభానిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో తిరువూరులోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద సుబానీని పరిశీలించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. అంబులెన్స్ డ్రైవర్ సుభాని మృతదేహాన్ని మునుకుల్లా గ్రామానికి తీసుకెళ్లకుండా ఆ గ్రామ శివారులోని వదిలేసి వెళ్ళాడు.. ఇంటివద్దకు తీసుకెళ్లమని సుభాని భార్య అంబులెన్స్ డ్రైవర్ ను ఎంత వేడుకున్నా వినలేదు..



మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు కూడా రాకపోవడంతో ఆమె ఏమి చేయలేక నిస్తేజంతో ఉండిపోయారు.. ఈ ఘటన చూసిన పలువురు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.. స్పందించిన ప్రభుత్వం డ్రైవర్ పై చర్యలకు ఉపక్రమించింది.