లోన్ యాప్‌లతో రూ.21వేల కోట్ల వ్యాపారం.. రోజుకు రూ.10కోట్ల బిజినెస్

లోన్ యాప్‌లతో రూ.21వేల కోట్ల వ్యాపారం.. రోజుకు రూ.10కోట్ల బిజినెస్

Loan App: చాలా ఈజీగా పర్సనల్స్ లోన్స్ ఇచ్చేస్తాం.. ఇలా చేయండి.. అలా చేయండి అంటూ ఆఫర్ చేసి ఆ తర్వాత పెట్టిన గడువులోగా ఇవ్వకపోతే సీరియస్ గా బెదిరింపులకు దిగితున్న అక్రమాలకు చెక్ పెడుతున్నారు అధికారులు. ఇలా అధిక వడ్డీలతో వసూలు చేసుకుంటున్న యాప్‌ల అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి చూస్తున్నాయి. ఇటీవలే 30 మంది బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
15 రోజుల్లోనే దర్యాప్తు చేపట్టి సంచలన అంశాలను తెలుసుకున్నారు.

చైనా దేశస్థులు కొందరు తెరవెనుక ఉండి నడిపిస్తున్న ఈ లోన్ దందాతో కేవలం 6 నెలల్లోనే 1.4 కోట్ల లావాదేవీల ద్వారా రూ.21వేల కోట్ల వ్యాపారం చేశారని గుర్తించారు. ఇదంతా కేవలం ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయమే. మరోవైపు రుణాల యాప్‌ల రూపకల్పన, కాల్‌ సెంటర్ల నిర్వహణలో అన్నీ తానై వ్యవహరించిన చూ వుయ్‌ అలియాస్‌ లాంబోను పోలీసులు బుధవారం ఢిల్లీలో అరెస్టు చేశారు.

విచారణ కోసం అతణ్ని హైదరాబాద్‌కు తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా లావాదేవీలు జరుపుతున్న లాంబోను సైబర్‌క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.రమేష్‌ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రిమాండ్‌లోకి తీసుకున్నారు. తప్పించుకునే క్రమంలో ఢిల్లీ నుంచి షాంఘైకి పారిపోతుండా విమానం ఎక్కే లోపే పట్టుకోగలిగారు.

సీక్రెట్‌గా పారిపోతుంటే:
డిసెంబర్ 22న గురుగ్రాంలోని రెండు కాల్‌సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. లాంబో తన అనుచరుడు నాగరాజుతో కలిసి కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి లాంబోపై నిఘా పెట్టిన పోలీసులు ఈ కేసులో ఢిల్లీలో అరెస్టు అయిన యాన్‌ యాన్‌ అలియాస్‌ జెన్నీఫర్‌ అనే చైనా దేశానికి చెందిన యువతిని విచారించారు.

ఆ లోన్ యాప్స్ ఇవే:
ఆమె తెలిపిన ఇచ్చిన సమాచారం ఆధారంగా లాంబో.. అగ్లో టెక్నాలజీస్‌, ల్యూఫాంగ్‌, న్యాబ్లూమ్‌, పిన్‌ప్రింట్‌ టెక్నాలజీస్‌ అనే పేర్లతో లోన్ యాప్‌లు ప్రారంభించినట్లు తెలుసుకున్నారు. అనంతరం చైనాకు పారిపోతున్నాడన్న కచ్చితమైన సమాచారంతో బుధవారం తెల్లవారుజామున లాంబో, నాగరాజులను అరెస్టు చేసినట్లు అదనపు సీపీ(నేరపరిశోధన) శిఖా గోయల్‌ తెలిపారు.

డైలీ రూ.10 కోట్ల వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న చైనా కంపెనీలు బాధితుల నుంచి రోజుకు రూ.10 కోట్లకుపైగా వసూలు చేస్తున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ప్రైమరీ ఎవిడెన్స్ దొరికాయి. ఈ నగదును తొలుత ఈ-వ్యాలెట్లలోకి బదిలీ చేసుకుని అనంతరం 340 వర్చువల్‌ ఖాతాల్లోకి డిపాజిట్‌ చేస్తున్నారు. ఆ తర్వాత వేర్వేరు కంపెనీల అకౌంట్లు, పర్సనల్ బ్యాంకు అకౌంట్లలోకి పంపించుకోవడంతో పాటు బిట్‌కాయిన్ల రూపంలో ఇంటర్నేషనల్ అకౌంట్లలోకి మళ్లిస్తున్నట్లు గుర్తించారు.