ఉక్కు కోసం ఉవ్వెత్తున.. నేడే రాష్ట్రబంద్!

ఉక్కు కోసం ఉవ్వెత్తున.. నేడే రాష్ట్రబంద్!

విశాఖ సాగర తీరంలో ఉద్యమ కెరటాలు ఎగసి పడుతున్నాయి. ఉక్కి పిడికిలి బిగించిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఉవ్వెత్తున బంద్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉవ్వెత్తున బంద్‌ కొనసాగుతోంది. ఉక్కు పరిరక్షణసమితి పిలుపు మేరకు బంద్‌‌లో అన్నీ పార్టీలు పాల్గొంటున్నాయి. గనుల కేటాయింపు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం నిలబెట్టాలని, ప్రవేట్‌పరం చేయరాదని కార్మికులు, రాజకీయపార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలు నేటి బంద్‌కు మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోపాటు… వైసీపీ కూడా బంద్‌లో పాల్గొంటోంది.

స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న బంద్‌కు సహకరిస్తున్నట్టు పార్టీలు వెల్లడించగా.. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితం చేస్తున్నట్లు రవాణ మంత్రి ప్రకటన చేశారు. ఆ తర్వాత నల్ల రిబ్బన్లు ధరించి సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జనసేన పార్టీ విశాఖ వరకు ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు వెల్లడించింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు బంద్‌ను విజయవంతం చేసేలా ఐక్య కార్యాచరణ చేపట్టారు. నష్టాల పేరుతో బడా కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ ఉక్కును ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు తెరిసిన మోడీ ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్‌ప్లాంట్‌ కూడా ప్రమాదంలో పడగా.. విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. వారికి బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ వెళ్లి ఉద్యమకారులతో మాట్లాడి వచ్చారు.

గత ఐదు రోజులుగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బంద్‌ను విజయవంతం చేసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. సీపీఎం, సీపీఐలతోపాటు పలు కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు.

వర్తక, వ్యాపార సంస్థలతోపాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛదంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు వెళ్లనున్నారు. కార్మికుల పోరాటంతోపాటు రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలపనున్నారు. మరోవైపు బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేంత వరకు సమైక్య పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అత్యవసారాలు మినహా అన్ని బంద్ అయ్యాయి.

2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుంది. అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు.. మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించడం దారుణమైందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బంద్‌ సక్సెస్‌తో కేంద్రానికి బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి.