ఏపీలో ఇక తప్పుడు ప్రచారాలకు, ఫేక్ న్యూస్‌కు చెక్.. వెబ్ సైట్ ఆవిష్కరించిన సీఎం జగన్

ఏపీలో ఇక తప్పుడు ప్రచారాలకు, ఫేక్ న్యూస్‌కు చెక్.. వెబ్ సైట్ ఆవిష్కరించిన సీఎం జగన్

ap cm jagan starts fact check website: కొందరు ఆకతాయిలు, అవకాశవాదులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు, ఫేక్ న్యూస్ కు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ ఏపీ(Fact Check AP) వెబ్ సైట్ ను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్ సైట్ తో పాటు ట్విట్టర్ అకౌంట్ ను ఆవిష్కరించిన సీఎం జగన్, దాని ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఓ వర్గం ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంతో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ దోహదపడుతుందన్నారు.

ప్రజలు ముందుకు వాస్తవాలు:
వాస్తవాలను అందించడంతో పాటు వెబ్ సైట్ లో ఫేక్, ఫ్యాక్ట్ అనే ప్రత్యేక ఫీచర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉన్న అంశాలకు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచేలా ఈ పోర్టల్ ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా, ఆన్ లైన్ వెబ్ సైట్ లలో అత్యంత నమ్మకం కలిగించేలా వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మొద్దని సీఎం జగన్ సూచించారు. ఫ్యాక్ట్ చెక్ చేసుకునేందుకే వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చామని.. సంస్థలు, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగ్ లు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.

తప్పుడు ప్రచారానికి ఎండ్ కార్డ్:
మీడియా, సోషల్ మీడియాలు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని ఖండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్‌ చెక్‌ ఏపీ’ వేదికను ఏర్పాటు చేసింది. కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సహా ‘ఫ్యాక్ట్‌ చెక్‌ ఏపీ’ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందని సీఎం తెలిపారు. దుష్ప్రచారం ఎలా తప్పో ఆధారాలతో సహా చూపించడమే ఫ్యాక్ట్‌ చెక్‌ ఉద్దేశమన్నారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని సీఎం అన్నారు.

CM YS Jagan Launched AP Fact Check Website And Twitter Account - Sakshi

నిజమేంటో, అబద్ధం ఏంటో చూపిస్తాం:
నిజమేంటో, అబద్ధం ఏంటో చూపించడమే ఫ్యాక్ట్‌ చెక్‌ ఏపీ ముఖ్య ఉద్దేశం అన్నారు సీఎం జగన్. దురుద్దేశపూర్వక ప్రచారంపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం జగన్… దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడ నుంచి మొదలైందో గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు.