CM Jagan Vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..

CM Jagan Vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న సీఎం జగన్.. ఎప్పుడు, ఎక్కడ అంటే..

Cm Jagan Covid 19 Vaccine

Cm Jagan Covid 19 Vaccine : ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు వ్యాక్సిన్‌ వేసుకోనున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోనున్నారు. భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు.

ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కోవిడ్‌ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ముందున్నామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 నుంచి సచివాలయాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రజల్లో అపోహలు తొలగాలి, ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలని ఎంపీ మోపిదేవి కోరారు.

అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140వ వార్డు సచివాలయంలో ఉదయం 11.10 గంటలకు సీఎం పేరు నమోదు చేయించుకుంటారు. 11.25 గంటలకు వ్యాక్సిన్‌ వేయించుకుంటారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం.. డాక్టర్ల పర్యవేక్షణలో అరగంటపాటు అక్కడే ఉంటారు. సచివాలయం, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.

వ్యాక్సినేషన్ తర్వాత 11.55 గంటలకు సీఎం జగన్ గుంటూరు నుంచి బయలుదేరి 12.35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ 3.25 గంటల వరకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 3.35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్:
రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ భారీగా కొత్త కేసులు పెరిగాయి. తాజాగా దాదాపు వెయ్యి కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 31వేల 325 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, 997 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8లక్షల 99వేల 812కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 181 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరంలో 4 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం(మార్చి 29,2021) బులెటిన్‌ విడుదల చేసింది.

ఇక, ఆరోగ్య శాఖ మరో షాకింగ్ విషయం చెప్పింది. 24 గంటల్లో కరోనా చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందినట్లు వెల్లడించింది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7వేల 210కి చేరింది. కాగా, ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం గమనార్హం.

అలాగే ఒక్క రోజులో కరోనా నుంచి 282 మంది పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6వేల 104కు పడిపోయాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,50,21,363 నమూనాలను పరీక్షించారు.