మంత్రి పెద్దిరెడ్డి బయటకి రాకూడదు, ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

మంత్రి పెద్దిరెడ్డి బయటకి రాకూడదు, ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

ap sec sensational orders: ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ వర్గాలు, మంత్రులతో ఎస్ఈసీ(రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నిమ్మగడ్డ, తాజాగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ ఇచ్చారు.

ఏపీ ఎస్ఈసీ సంచలన ఆదేశాలు ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం(హౌస్ అరెస్ట్) చేయాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అలాగే మంత్రికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఈ నెల(ఫిబ్రవరి) 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలని ఎస్ఈసీ చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని డీజీపీకి రాసిన లేఖలో తెలిపింది. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను జత చేసింది ఎస్ఈసీ. ఎన్నికలు సజావుగా సాగేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకే ఈ చర్యలని ఎస్ఈసీ తెలిపారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు నిలిపివేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి శుక్రవారం(ఫిబ్రవరి 5,2021) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని, ఏకగ్రీవాలను ప్రకటించకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయకూడదని ఆయన రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అంతేకాదు నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బ్లాక్ లిస్టులో పెడతామని, ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రి చేసిన ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ చర్యలు తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.

మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలపై ఇదివరకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. వారు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. తాజాగా, మంత్రిని ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలు వైసీపీ వర్గాలతో పాటు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కాగా, మంత్రిని ఇంటికే పరిమితం చేయాలంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. మంత్రిపై చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి ఉందా లేదా అన్నదానిపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. ఎస్ఈసీ ఆదేశాలపై కోర్టుకి వెళ్తామని సుబ్బారెడ్డి చెప్పారు.

కాగా, మంత్రి పెద్దిరెడ్డిని ఏ ఇంటికి పరిమితం చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు. ఎందుకంటే.. మంత్రి పెద్దిరెడ్డికి తిరుపతి, పుంగనూరుతో పాటు చాలా చోట్ల ఇళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఏ ఇంటికి ఆయనను పరిమితం చేస్తారన్నది తేలాల్సి ఉంది.

ఈ వ్యవహారంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించారు. ఎస్ఈసీ నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని తెలిపారు. ఆదేశాలు అందాక ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.