AP-Telangana Boarder: అంబులెన్సులకు సరిహద్దు వివాదం.. టెన్షన్.. టెన్షన్!

కరోనా వేళ రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ప్రాణాలను బలితీసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రజలను నిలిపివేస్తున్నారు.

AP-Telangana Boarder: అంబులెన్సులకు సరిహద్దు వివాదం.. టెన్షన్.. టెన్షన్!

Ap Telangana Boarder

AP-Telangana Boarder: కరోనా వేళ రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ప్రాణాలను బలితీసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రజలను నిలిపివేస్తున్నారు. సరైన కారణం లేకపోతే వెనక్కు పంపిస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రయాణాలకు అనుగుణంగా పాసులు జారీ చేస్తుంది. అయితే.. ఇక వచ్చిన చిక్కల్లా అంబులెన్సులకు కూడా ఆంక్షలు పెట్టడమే. ఏపీతో పోల్చితే హైదరాబాద్ నగరంలో మెరుగైన వైద్య సదుపాయాలున్నాయి.

అందుకే, మెరుగైన చికిత్స కావాల్సిన వారు ఏపీ నుండి అంబులెన్సులలో హైదరాబాద్ వస్తున్నారు. కానీ, వారిని తెలంగాణ పోలీసులు సరిహద్దులో నిలిపివేస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. తెలంగాణ ఆసుపత్రిలో బెడ్ రిజర్వ్ చేసుకుంటేనే సరిహద్దు నుండి అనుమతిస్తున్నారు. ఇందులో తెలంగాణ హైకోర్టు కల్పించుకొని ప్రభుత్వానికి నచ్చజెప్పినా.. ఆగ్రహించిన తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గడం లేదు.

శుక్రవారం కూడా ఇదే విషయంపై హైకోర్టులో ప్రభుత్వంతో వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలో కొనసాగిన విచారణలో అంబులెన్సులు ఆపడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి హక్కులున్న నేషనల్ హైవేలపై తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించే హక్కు ఉండదన్నారు. అంబులెన్సులు అడ్డుకోవద్దని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరు తమ ప్రాణాలను కాపాడుకొనే హక్కు ఉందన్న కోర్టు.. అంబులెన్సులను ఆపవద్దని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం ఎలా సర్క్యులర్ జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి ఆంక్షలు లేవని.. మీరే ఎందుకు ఇలా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర పౌరుల బాధ్యత తమపై ఉందని.. అందుకే ఆంక్షలు విధిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ఏజీ వివరణ ఇచ్చారు. ఆసుపత్రిలో బెడ్ వసతి ఉంటే పంపిస్తున్నారని.. కొన్ని రాష్ట్రాలు అసలు నెగటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి ఇస్తున్నాయని వివరణ ఇచ్చారు.