AP-Telangana Boarder: సరిహద్దులో గందరగోళం.. భారీగా ట్రాఫిక్ జామ్!

రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలోనే దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు సరిహద్దుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో కూడా పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు.

AP-Telangana Boarder: సరిహద్దులో గందరగోళం.. భారీగా ట్రాఫిక్ జామ్!

Ap Telangana Boarder

AP-Telangana Boarder: రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలోనే దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు సరిహద్దుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో కూడా పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ ప్రభావం ఏపీ.. తెలంగాణ సరిహద్దు మీద కూడా పడింది. తెలంగాణలో ఉదయం పది గంటల వరకు లాక్ డౌన్ లో సడలింపులు ఉండడంతో రెండు రోజుల క్రితం వరకు అంతర్రాష్ట్ర రవాణాకి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది.

దీనికి తోడు ఏపీలో మధ్యాహ్నం 12 గంటల వరకు లాక్ డౌన్ మినహాయింపులు ఉండడం.. అది కూడా లాక్ డౌన్ కేవలం రాష్ట్రాల ప్రభుత్వాల నిర్ణయంతో జాతీయ రహదారులకు వర్తించని నిబంధనలతో అంతర్రాష్ట్ర రవాణా యథేచ్ఛగా సాగుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా తెలంగాణ ప్రభుత్వం శనివారం నుండి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుంది. కేవలం ఈ పాస్ ఉన్న వాహనాలను మినహాయించి ఒక్క అంబులెన్సులను తప్ప మిగతా ఏ వాహనాలను అనుమతించడం లేదు.

దీంతో ఎప్పటి మాదిరి అంతర్రాష్ట్రాల మధ్య తిరిగే వాహనాలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. పోలీసులు వాహనాలను అనుమతించకపోడంతో చాలా మంది వాహనదారులు రోడ్లపైనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సరిహద్దులోని కృష్ణా జిల్లా గరికపాడు వద్ద, సూర్యాపేట జిల్లా సరిహద్దుతో పాటు మఠంపల్లి, పులిచింతల చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మఠంపల్లి, పులిచింతల మధ్య వద్ద రవాణా పూర్తిగా నిలిపివేయగా కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణ పోలీసులు వాహనాలను అనుమతిస్తున్నారు.

లాక్ డౌన్ మినహాయింపు సమయానికి సరిహద్దు వద్దకు చేరుకున్న వాహనాలను కూడా అనుమతించకపోవడంతో ప్రయాణికులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా.. కేవలం ఈ పాస్ ఉన్న వారికి, అంబులెన్సులకు మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే.. నిన్నటి వరకు లాక్ డౌన్ లో కూడా సరిహద్దులో పెద్దగా పట్టించుకోకపోగా ఇప్పుడు కఠినంగా అమలు చేస్తుండడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్లుగా తెలుస్తుంది. మరో రెండు మూడు రోజులు సరిహద్దులో ఇదే పరిస్థితి నెలకొనగా అనుమతి లేకుండా ఎవరూ సరిహద్దు వద్దకు రావద్దని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.