ఏపీ – తెలంగాణ జల వివాదం : కేటాయించిందే వాడుకుంటాం – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : May 13, 2020 / 02:59 AM IST
ఏపీ – తెలంగాణ జల వివాదం : కేటాయించిందే వాడుకుంటాం – సీఎం జగన్

తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదం రాజుకుంది. కృష్ణా జలాల కోసం ఇరు రాష్ట్రాల మధ్య వార్‌ మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఏపీ తీసుకున్న నిర్ణయం ఇందుకు ఆజ్యం పోసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ సర్కార్‌ మండిపడుతోంది. సీఎం కేసీఆర్‌ ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. అపెక్స్‌ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టులు ఎలా కడతారని ఫైర్‌ అయ్యారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజుకుంది.

తెలంగాణ సర్కార్‌ ఆరోపణలపై ఏపీ సీఎం జగన్ కూడా సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు తమ భూభాగంలో ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఏపీకి కేటాయించిన నీటిని తీసుకోవడానికే పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటున్నామన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగడానికి నీళ్లులేని పరిస్థితి ఉందన్నారు. దీనిపై ఎవరైనా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కోరారు.

ఏపీలో కొత్త ప్రాజెక్టుల నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాల నేపథ్యంలో… ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి నీటి కేటాయింపులు చేస్తుందని జగన్‌  తెలిపారు. ఆ పరిధిని దాటి నీటిని తీసుకెళ్లడానికి బోర్డు కూడా అంగీకరించదని గుర్తు చేశారు. 

శ్రీశైలంలో 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉందని వివరించారు. ఆ స్థాయిలో నీటిమట్టం సంవత్సరంలో సగటున 10 రోజులకు మించి ఉండదన్నారు. ఆ పది రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా కరువు పీడిత రాయలసీమ సహా నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీళ్లు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

అదే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు ద్వారా 7వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లడం కష్టమన్నారు. ఇక 841 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు నుంచి వెళ్లే నీళ్లు వెయ్యి క్యూసెక్కులు మాత్రమేనన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టుల ద్వారా 200 టీఎంసీలకుపైగా కృష్ణా జలాల్ని వాడుకుంటున్నారని జగన్‌ చెప్పుకొచ్చారు. 

Read More :

* ఏపీ ప్రాజెక్ట్‌పై సీఎం కేసీఆర్ అభ్యంతరం

మానవతా దృక్పథంతో ఆలోచించండి: సీఎం జగన్