FISH : చేపలు కొంటున్నారా…తాజావో కాదో తెలుసుకోవటం ఎలాగంటే!..

చేపలు తాజగా ఉన్నాయా.. లేదా.. అన్నది వాటి నుండి వెలువడే వాసన చూసి చెప్పవచ్చు. చేపలు వత్తిన వెంటనే మెత్తగా ఉంటే అవి ఎప్పుడో పట్టినవని అర్ధం..

10TV Telugu News

FISH : మాంస ప్రియులు ఎక్కువగా చేపలు తినేందుకు ఇష్టపడుతుంటారు. చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందుకే వైద్యులు సైతం చేపల్ని ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తుంటారు. తరుచు చేపలను తినటం వల్ల అనేక అనారోగ్య సమస్యలను మనదరి చేరకుండా జాగ్రత్తపడొచ్చు. చేపల్లో ప్రొటీన్, విటమిన్ డి, కాల్సియం, ఫాస్ఫరస్, ఇనుము, జింక్ , అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఒమేగా 3 వంటి ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో లభిస్తాయి.

శరీరంలోని కొవ్వులను అదుపులో ఉంచటంతోపాటు, జీవక్రియలకు ఎంతగానో చేపలు దోహదపడతాయి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందు జలపుష్పాలుగా చేపలను అంతా ముద్దుగా పిలుచుకుంటుంటారు. అయితే మార్కెట్లో మనం చేపలు కొనుగోలు చేసేందుకు వెళ్ళినప్పుడు అక్కడ తాము కొనుగోలు చేయబోతున్న చేపలు తాజాగా ఉన్నాయో లేదో కనిపెట్టటం ఎలాగని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా తాజా చేపలను ఈజీగా గుర్తించవచ్చు.

చేపలు తాజగా ఉన్నాయా.. లేదా.. అన్నది వాటి నుండి వెలువడే వాసన చూసి చెప్పవచ్చు. చేపలు వత్తిన వెంటనే మెత్తగా ఉంటే అవి ఎప్పుడో పట్టినవని అర్ధం.. వత్తినసమయంలో గట్టిగా ఉంటే తాజాగా పట్టి తెచ్చినవని భావించాలి. చేప కళ్ళపై తెల్లటి పొరలా ఏర్పడినా లేదంటే కళ్ళు గుడ్డు లోతుగా వెళ్ళినా ఆ చేపలు తాజా చేపలు కాదని అర్ధం చేసుకోవాలి. తాజా చేపలకు కళ్ళు ఉబ్బి, తేజో వంతంగా ఉంటాయి.

చేపల మొప్పలను పరిశీలించటం ద్వారా అవి తాజావో కాదో చెప్పవచ్చు. తాజా చేపలకు మొప్పల క్రింద చూడగానే క్రింది భాగంలో తేమతో కూడిన గులాబీ రంగులో ఉంటే తాజా చేపలని అర్ధం, అలాకాకుండా పొడిబారిపోయి ఉంటే నిల్వవున్న చేపలని గుర్తించాలి. అయితే ఇటీ వలికాలంలో మొప్పలకు రంగు వేయటం ద్వారా విక్రయదారులు కొనుగోలు దారులను మోసం చేస్తున్నారు. అయితే మనం చేపలు కొనుగోలు చేసే సమయంలో అన్నింటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

10TV Telugu News