రండి..వచ్చేయండి..ఏం భయం లేదు : వలస కార్మికులకు వేడుకోలు

  • Published By: madhu ,Published On : June 4, 2020 / 01:54 AM IST
రండి..వచ్చేయండి..ఏం భయం లేదు : వలస కార్మికులకు వేడుకోలు

వలస కార్మికుల్లారా..వచ్చేయండి..ఏం భయం లేదు..మేము చూసుకుంటాం అంటున్నారు కాంట్రాక్టర్లు. ప్రధానంగా నిర్మాణ రంగంలో ఉన్న కాంట్రాక్టర్లు వారి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్న ఎంతో మంది వారి సొంతూళ్లకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా నిర్మాణ రంగం కుదేలై పోయింది.

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా నిర్మాణ రంగానికి పలు అవకాశాలు కల్పించారు. కానీ వలస కూలీలు లేకపోవడంతో నిర్మాణాలు అంతంత మాత్రమే ప్రారంభమయ్యాయి. తిరిగి వీరిని రప్పిస్తే కాని..నిర్మాణ రంగం మళ్లీ గాడిలో పడదని అధికారులు భావించారు. దీంతో తిరిగి రప్పించే చర్యలు సాగుతున్నాయి. దాదాపు లక్ష మంది కార్మికులతో సంప్రదింపులు జరిపి వారు తెలంగాణకు వచ్చే విధంగా వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో 80 వేల మంది వరకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 

నిర్మాణ రంగంలో కీలకంగా ఉండే దాదాపు 12 రకాల ట్రేడ్స్ లో స్థానిక యువకులకు శిక్షణ ఇచ్చే పనిలో పడ్డారు. ఈ బాధ్యతను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్స్ (NAC) తీసుకుంది. జిల్లాకు వెయ్యి మంది చొప్పున ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. సొంత రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చే విధంగా చూడాలని లేబర్ కాంట్రాక్టర్లకు సూచించారు.

బడా నిర్మాణ సంస్థలే ఇందులో కీలక సూచనలు చేశఆయి. దీంతో రంగంలోకి దిగిన లేబర్ కాంట్రాక్టర్లు…ఆయా రాష్ట్రాల్లో ఉన్న కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. క్రమ క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న వారు ఇక్కడకు రావాడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నిర్మాణ రంగం జరుగుతున్న ప్రదేశంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు..ఎలాంటి భయం అవసరం లేదని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా కార్మికులు ఉంటున్న ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఉండడంతో వలస కూలీలు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. తెలంగాణకు వెళితే..డబ్బులు వస్తాయని మరికొంతమంది భావిస్తున్నారు. 

మరోవైపు..కరోనా భయంతో ఎడారి దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు తిరిగి ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం వీరంత ఖాళీగా ఉండంతో వీరిని ఉపయోగించుకోవాలని లేబర్ కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. వీరికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం ప్రక్రియలు పూర్తి చేసి నిర్మాణ రంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకరావాలని నిర్మాణ సంస్థలు, న్యాక్ యంత్రాంగం భావిస్తున్నాయి. 

Read: దేశంలోనే ఫస్ట్ టైమ్ : తెలంగాణలో ఇంటి వద్దకే మందులు