బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక, ఆ రెండు రోజులు బంద్

బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక, ఆ రెండు రోజులు బంద్

bank strike for two days: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెలలో(మార్చి) దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఖాతాదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులో ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే ముందే చూసుకోవడం ఉత్తమం.

బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పట్టబోతున్నారు. మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు బంద్ చేసి నిరసన తెలపనున్నారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మె నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15, 16వ తేదీలలో రెండు రోజుల పాటు స‌మ్మె చేయాల‌ని 9 బ్యాంకు ఉద్యోగ సంఘాల స‌మాఖ్య.. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ (UFBU) నిర్ణయించాయి.

UFBUలో అఖిల భార‌త ఉద్యోగుల సంఘం (AIBEA), అఖిల భార‌త బ్యాంక్ అధికారుల కాన్ఫిడ‌రేష‌న్‌ (AIBOC), నేష‌న‌ల్ కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), అఖిల భార‌త బ్యాంక్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫిడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా (BEFI) స‌భ్యులుగా ఉన్నాయి. ఇంకా ఇండియ‌న్ నేష‌న‌ల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడ‌రేష‌న్ (INBEF‌), ఇండియ‌న్ నేష‌న‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్స్ కాంగ్రెస్ (INBOC), నేష‌న‌ల్ ఆర్గనైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ వ‌ర్కర్స్ (NOBW), నేష‌న‌ల్ ఆర్గనైజేష‌న్ ఆఫ్ బ్యాంక్ ఆఫీస‌ర్స్ (NOBO) కూడా స‌భ్య సంఘాలుగా ఉన్నాయి.

దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియ‌న్స్ (UFBU) పిలుపునివ్వగా, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోషియేషన్ మద్దుతు తెలిపింది. కేంద్రం తీరుపై ఎంప్లాయిస్ అసోసియేషన్ మండిపడింది. లాభాల్లో నడుస్తున్న బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం నిర్ణయం సరికాదంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.

పార్లమెంటులో బ‌డ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ కీలక ప్రకటన చేశారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించ‌నున్నామ‌ని ప్రక‌టించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిరసనకు రెడీ అయ్యాయి.