‘భీష్మ’ డైరెక్టర్‌కి బొమ్మ చూపించాడుగా..

‘భీష్మ’ డైరెక్టర్‌కి బొమ్మ చూపించాడుగా..

Venky Kudumula: టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కి ఝలక్ ఇచ్చాడు ఓ కేటుగాడు.. ‘ఛలో’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని, గతేడాది రెండో సినిమా ‘భీష్మ’ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములకు ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానల్‌ మెంబర్‌నంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తమ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘భీష్మ’ చిత్రాన్ని ఆరు కేటగిరీల్లో నామినేట్‌ చేస్తామని చెప్పాడు..

Chalo

ఎంట్రీ ఫీజుగా ఒక్కొక్క కేటగిరీకి పదకొండు వేల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పాడు. ఆ వ్యక్తి మాటలు నిజమేనని నమ్మిన వెంకీ కుడుముల ఆరు కేటగిరీలకు కలిపి ఆరవై ఆరువేల రూపాయలను అతను చెప్పిన అకౌంట్‌లో డిపాజిట్‌ చేశాడు. అయితే మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్‌ చేసి ఆరు కేటగిరీలకు సంబంధించి మూడింట్లో నామినేషన్స్‌లో తప్పు జరిగిందని, సరి చేయడానికి మరి కాస్త మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని చెప్పాడు.

Bheeshma

దాంతో అనుమానం వచ్చిన వెంకీ కుడుముల నామినేషన్‌ అవసరం లేదని చెప్పాడు. తర్వాత ఆరా తీయగా, అది ఫేక్‌ కాల్ అని తెలిసింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న వెంకీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్‌ నెంబర్, అకౌంట్‌ వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.