బోయిన్ పల్లి కిడ్నాప్ : భూమా అఖిల ప్రియ బెయిల్ తిరస్కరణ

బోయిన్ పల్లి కిడ్నాప్ : భూమా అఖిల ప్రియ బెయిల్ తిరస్కరణ

Bhuma Akhila priya Bail Petition : కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్ట్ తిరస్కరించింది. అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేశామని పోలీసులు మెమో దాఖలు చేశారు. దీంతో… జీవితకాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్ట్ పేర్కొంది. బెయిల్ పిటిషన్‌ను రిటర్న్ చేసింది.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కస్టడీలో అఖిలప్రియ నోరు విప్పడంతో చకాచకా అరెస్ట్‌ల పర్వం కొనసాగిస్తున్నారు పోలీసులు. అసలు నిందితులను తప్ప.. దాదాపు అందరిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీను, జగన్‌విఖ్యాత్‌ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్‌ను తొందరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు.

ఈ కేసుతో సంబంధమున్న మరో 15 మందిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 19కి చేరింది. పోలీస్‌ కస్టడీలో ప్రధాన నిందితురాలైన అఖిలప్రియ వెల్లడించిన సమాచారం ఆధారంగా.. ఈ 15 మందిని అరెస్ట్‌ చేసినట్టు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కిడ్నాప్‌కు వినియోగించిన వాహనాలు, సెల్‌ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్, జగత్‌ విఖ్యాత్‌రెడ్డితో పాటు గుంటూరు శీను కలిసి కిడ్నాప్‌కు పథకం రూపొందించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో గుంటూరు శ్రీను కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు. పక్కా ప్లాన్‌ ప్రకారం రెక్కి నిర్వహించి ఈ కిడ్నాప్‌ చేశారని.. నిందితులను విచారించినప్పుడు తెలిసిందన్నారు పోలీసులు.