నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయ శ్రీ ఆత్మహత్య

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయ శ్రీ  ఆత్మహత్య

Jayashree Ramaiah: కన్నడ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ జయ శ్రీ రామయ్య ఆత్మహత్యతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచింది. డిప్రెషన్‌ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని సన్నిహితులు భావిస్తున్నారు. కాగా గతేడాది జూలై 22న ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లు ఫేస్‌బుక్‌‌లో పోస్ట్‌ చేసింది.. దీంతో అభిమానులు ఆందోళన చెందగా వెంటనే ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసింది.

ఆ సమయంలో కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్‌ ఆమెకు ధైర్యం చెప్పినట్లు కూడా వార్తలు వినిపించాయి. జయశ్రీ, సుదీప్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపెట్ చేసింది.
కానీ మళ్లీ ఐదు రోజులకే.. జూలై 25న అభిమానులతో లైవ్‌లో ముచ్చటించిన జయశ్రీ తన మనసులో ఉన్న బాధనంతా వెళ్లగక్కింది.

ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదని.. సుదీప్‌ సర్‌ నుంచి ఆర్థిక సాయం కోరట్లేదు కానీ నా చావును మాత్రమే కోరుకుంటున్నాను. డిపప్రెషన్‌తో పోరాడలేకపోతున్నా. ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను కానీ మానసిక ఒత్తిడితోనే చచ్చిపోతున్నా.. అని చెప్పుకొచ్చింది. దీర్ఘకాలంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన జయశ్రీ చివరికి అర్ధాంతరంగా తనువు చాలించింది.