ఢీ అంటే ఢీ : రైతుల ధర్నాకు బీజేపీ యాక్షన్ ప్లాన్

  • Published By: madhu ,Published On : December 12, 2020 / 07:22 AM IST
ఢీ అంటే ఢీ : రైతుల ధర్నాకు బీజేపీ యాక్షన్ ప్లాన్

BJP action plan for farmers’ dharna : ఎవరూ వెనక్కి తగ్గట్లేదు.. కొత్త వ్యవసాయ చట్టాల రద్దుపై పట్టు వీడేది లేదని రైతులంటుంటే.. చట్టాల రద్దు ప్రసక్తే లేదంటోంది కేంద్రం. చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేస్తే.. కొత్త చట్టాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కదం తొక్కిన రైతులు.. ఇప్పుడు తమ పోరాటాన్ని రోడ్లపై కొనసాగిస్తూనే.. దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో భారతీయ కిసాన్ యూనియన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.. ఈ వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌లకు దోచిపెట్టేలా ఉన్నాయంటూ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు రైతులు.

సరిహద్దుల వద్ద భద్రత :-
రైతులు కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడీ పోరాటం కొత్త దారిని తీసుకుంది.. అయితే తమ పోరాటం కోర్టులో, కేంద్రంతో కొనసాగుతుందంటున్నారు రైతులు.. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉ్రదిక్త వాతావరణం ఇప్పుడప్పుడే చల్లారే పరిస్థితి కనిపించడం లేదు… కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ కమిటీ నేతృత్వంలో సుమారు 700 ట్రాక్టర్లు ర్యాలీ తీశాయి.. దీంతో పోలీసులు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.. నేషనల్ హైవే 44ను మూసివేశారు.

ఐపీఎస్ అధికారులకు కరోనా :-
ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో చర్చలు జరిపిన కేంద్రం.. మరోసారి రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.. కొత్త చట్టాలను దేశం మొత్తం స్వాగతించినప్పటికీ కొన్ని రైతు సంఘాలు ఉద్యమ బాట పట్టాయంటోంది కేంద్రం.. కొత్త చట్టాల్లోని ఏ నిబంధనలు తమకు నష్టం కలిగిస్తాయని రైతులు భావిస్తున్నారో, ఆ నిబంధనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇక రైతుల ఆందోళనలపై కరోనా ప్రభావం చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.. ఢిల్లీ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు కరోనా సోకింది.. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.. ఢిల్లీ శివారుల్లో మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్‌లను ఏర్పాటు చేసి.. ముమ్మరంగా టెస్ట్‌లు నిర్వహిస్తోంది.

బీజేపీ దేశ వ్యాప్త ప్రచారం :-
రైతులు గూమికూడవద్దని పోలీసులు కోరుతున్నారు.. కరోనా వ్యాక్తికి కారణమవుతున్నారంటూ రైతు సంఘాలపై పోలీసులు కేసు పెట్టారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు పూర్తి స్థాయిలో మేలు చేస్తాయని చెబుతున్న బీజేపీ… వీటిపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా ప్రచారానికి సిద్ధమవుతోంది. వందకు పైగా మీడియా సమావేశాలు… 700 జిల్లాల్లో రైతులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.