BJP Horse : గుర్రానికి బీజేపీ జెండా రంగులు.. పోలీసులకు ఫిర్యాదు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా

BJP Horse : గుర్రానికి బీజేపీ జెండా రంగులు.. పోలీసులకు ఫిర్యాదు

Bjp Horse

BJP Horse : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా జన ఆశీర్వాద యాత్రలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కొత్తగా నియమితులైన మంత్రులు, ప్రమోషన్లు పొందిన వారు ఈ యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా ఓ గుర్రానికి బీజేపీ జెండా రంగులు వేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా నిర్వహించిన ఈ యాత్రలో గుర్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మాజీ మున్సిపల్ కార్పొరేటర్ రాందాస్ గార్గ్ అద్దెకు తెచ్చిన ఒక గుర్రానికి బీజేపీ జెండా రంగులతో పెయింట్ వేశారు. పార్టీ కండువాను దాని మెడకు కట్టారు. ఇండోర్‌లో నిర్వహించిన బీజేపీ జన ఆశీర్వాద్‌ యాత్రలో దీనిని ప్రదర్శించారు.

అయితే, గుర్రానికి బీజేపీ రంగులు వేయడం వివాదానికి దారితీసింది. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీకి చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు దీన్ని తీవ్రంగా పరిగణించారు. ఇది కచ్చితంగా జంతువులను హింసించడం కిందికే వస్తుందన్నారు. ఇండోర్ లోని సంయోగితా గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాలని వారు నిర్ణయించారు.

కేంద్ర కేబినెట్‌లో ఇటీవల కొత్తగా చేరిన కేంద్ర మంత్రులను ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసేందుకు జన ఆశీర్వాద్‌ యాత్రకు బీజేపీ శ్రీకారం చుట్టింది. 22 రాష్ట్రాల మీదుగా ఇది సాగనుంది.