Gujarat Election 2022: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు.. బీజేపీ గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ మేనిఫెస్టో‌ను శనివారం విడుదల చేసింది. యూనిఫాం సివిల్ కోడ్, యాంటీ రాడికలైజేషన్ సెల్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ రికవరీ యాక్ట్‌తో పాటు యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

Gujarat Election 2022: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు.. బీజేపీ గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Gujarath Election

Gujarat Election 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. గుజరాత్ యూనిఫాం సివిల్ కోడ్ కమిటీ సిఫార్సును పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలు, భారత వ్యతిరేక శక్తుల స్లీపర్ సెల్స్, సంభావ్య బెదిరింపులను గుర్తించడానికి, తొలగించడానికి యాంటీ రాడికలైజేషన్ సెల్‌ను రూపొందిస్తామని అన్నారు. మళ్లీ బీజేపీనే అధికారంలోకి తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అధికారంలోకి రాగానే ప్రజా ఆస్తులకు రక్షణ కలిగించే చట్టాన్నికూడా రూపొందిస్తామని చెప్పారు. ప్రజా ఆస్తులను ధ్వంసంచేసే, ప్రైవేట్ ఆస్తులను ఆక్రమించే సంఘ వ్యతిరేక శక్తుల నుండి రికవరీకి సంబంధించి చట్టం ఉంటుందని నడ్డా తెలిపారు.

Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల సమరం.. ఏడుగురు రెబల్స్‌పై వేటు వేసిన బీజేపీ..

గుజరాత్ పురోగతి కోసం రాష్ట్రాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడం ద్వారా గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో సమానం చేస్తామని నడ్డా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్ యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నడ్డా హామీ ఇచ్చారు. సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడానికి గుజరాత్ కృషి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోష్ కింద రూ. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టడం జరుగుతుందని తెలిపారు. సుజలాం సుఫలాం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్‌ వ్యవస్థలను బలోపేతం చేసి గుజరాత్ అంతటా నీటిపారుదలను అందించడానికి రూ. 25,000 కోట్లు కేటాయిస్తామని అన్నారు. గోశాలలను బలోపేతం చేస్తామని, వెయ్యి అదనపు మొబైల్ వెటర్నరీ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

Gujarat Assembly Election 2022: డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్) కింద ఒక కుటుంబానికి రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వార్షిక పరిమితిని రెట్టింపు చేస్తామని తెలిపారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా చర్యలు చేపడతామని నడ్డా తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో 20,000 ప్రభుత్వ పాఠశాలలను స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా మార్చడానికి చర్యలు తీసుకుంటామని జేపీ నడ్డా తెలిపారు. గుజరాత్‌లోని ప్రతి పౌరుడికి పక్కాఇల్లు ఉండేలా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 100శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళా సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్సు ప్రయాణం, రానున్న ఐదేళ్లలో మహిళలకు లక్షకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చారు. అదేవిధంగా కార్మికులకు రూ.2లక్షల వరకు పూచీకత్తులేని రుణాలను అందించడానికి శ్రామిక్ క్రెడిట్ కార్డ్‌లను ప్రవేశపెట్టడం జరుగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఇదిలాఉంటే గుజరాత్‌లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లను డిసెంబర్ 8న లెక్కింపు జరుగుతుంది.