బీజేపీ ఎంపీ ఆత్మహత్య..

బీజేపీ ఎంపీ ఆత్మహత్య..

Bjp Mp Ramswaroop Sharma Passed Away1

హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బిజెపి ఎంపీ రాంస్వరూప్ శర్మ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, శర్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలోని అతని నివాసంలో చోటుచేసుకుంది. ఎంపీ నివాసమైన ఆర్‌ఎంఎల్ హాస్పిటల్ సమీపంలో నిర్మించిన ఫ్లాట్‌లో ఈ ఘటన జరిగినట్లుగా చెబుతున్నారు. మరణానికి కారణం ఇంకా తెలియరాలేదు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎంపీ రాంస్వరూప్ శర్మ గది లోపలి నుండి మూసివేసి ఉండగా.. పోలీసులకు సమాచారం అందించారు. రామ్‌స్వరూప్ శర్మను ఉరి నుంచి కిందకు దించి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించాడని పోలీసులు తెలిపారు. ఇంతవరకు సూసైడ్ నోట్ లభ్యం కాలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

అతను కొంతకాలం అనారోగ్యంతో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని ఆరోగ్యం మెరుగుపడినట్లు చెబుతున్నారు. అయితే, అతని ఆకస్మిక మరణ వార్త అభిమానులను కలచివేస్తోంది. రామస్వరూప్ శర్మ మండీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీ అయ్యారు. ఒక సాధారణ కుటుంబానికి చెందిన రామ్‌స్వరూప్ శర్మ మండి జిల్లాలోని జోగేంద్రనగర్‌కు చెందినవాడు.

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రామస్వరూప్ శర్మ.. అంచలంచలుగా ఎదిగారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో పనిచేశారు. ఎంపీ మృతి చెందిన విషయాన్నీ బిజెపి మండి జిల్లా అధ్యక్షుడు రణవీర్ సింగ్ తెలిపారు. శర్మ మృతితో బుధవారం జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ సమావేశం నిలిచిపోయింది.