Black Fungus Brain : కొత్త ముప్పు.. మెదడులో బ్లాక్ ఫంగస్

దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.

Black Fungus Brain : కొత్త ముప్పు.. మెదడులో బ్లాక్ ఫంగస్

Black Fungus Brain

Black Fungus Found In Brains : దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా… మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్‌ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకి పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మన దేశంలో అత్యధికంగా ఎందుకు నమోదవుతున్నాయనే చర్చ జరుగుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారిని ఈ ఫంగస్ అటాక్ చేస్తోంది. బ్లాక్ ఫంగస్ కొవిడ్ కన్నా డేంజర్ గా మారుతోంది. ట్రీట్ మెంట్, మందులు పెద్ద ఎత్తున అందుబాటులో లేకపోవడం రోగుల ప్రాణాలు తీస్తోంది. బ్లాక్ ఫంగస్ పేరు వింటే చాలు ప్రాణాల మీద ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది.

కాగా, బ్లాక్ ఫంగస్.. రోజుకో వార్తతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోది. తాజాగి ఇది మెదడుపైనా ప్రభావం చూపిస్తోందని తెలిసింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని మహారాజా యశ్వంత్ రావ్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల్లో 15శాతం మంది బ్రెయిన్స్ లో బ్లాక్ ఫంగస్ గుర్తించారు. ఈ మేరకు న్యూరోసర్జరీ హెడ్ డాక్టర్ రాకేశ్ గుప్తా వెల్లడించారు. తలనొప్పి, వాంతులు ప్రాథమిక లక్షణాలని చెప్పారు. మెదడులో వ్యాధి ముదిరితే రోగి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందన్నారాయన.

”368 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారిలో 55 మందిలో మెదడులో బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ గుర్తించాము. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ(computerised tomography), ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా దీన్ని నిర్ధారించాము. చాలా మంది రోగుల్లో మెదడులో స్వల్ప పరిణామంలో ఇన్ ఫెక్షన్ గుర్తించాము. వారిలో నలుగురు రోగులకు వెంటనే మేజర్ బ్రెయిన్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ ఫెక్షన్ మరింత వ్యాపించకుండా వెంటనే సర్జరీ చేయాలి. ఆసుపత్రిలో అడ్మిట్ కాకముందే ఈ రోగుల్లో సైనస్ ద్వారా ఇన్ ఫెక్షన్ మెదడుకి చేరింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే యాంపోటెరిసిన్-బి(amphotericin-B) ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారికి ట్రీట్ మెంట్ చెయ్యలేకపోతున్నాం. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ కేసులు చూస్తున్నాం. అదే సమయంలో కరోనా బారిన పడని వారిలోనూ ఈ ఫంగస్ కేసులు గుర్తించడం జరిగింది” అని సీనియర్ డాక్టర్ రాకేష్ గుప్తా చెప్పారు.

బ్లాక్ ఫంగస్‌ అంటే…?
మ్యూకర్ మైకోసిస్.. దీన్నే జైకో‌మైకోసిస్, బ్లాక్ ఫంగస్‌గా పిలుస్తారు. ఇది కొత్త కాదు. వాతావరణంలో సహజంగానే ఉంటుంది. మనుషులకు చాలా అరుదుగా సోకుతుంది. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ ఫంగస్ ఒక రకమైన బూజు. గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్లి సైనస్, ఊపిరితిత్తుల్లో చేరుతాయి.

శరీరానికి అయిన గాయాల ద్వారా కూడా లోపలికి వెళ్లవచ్చు. మ్యూకర్ ‌మైకోసిస్ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకితే కంటి చూపు పోవచ్చు. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశాలున్నాయి. బ్లాక్ ఫంగల్ కేసుల్లో 50శాతం మరణాల రేటు నమోదవుతోంది. మూడో వంతు మంది కంటి చూపు కోల్పోతున్నారు. ముందుగానే గుర్తించి యాంటీఫంగల్‌ వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చుని వైద్యులు సూచిస్తున్నారు.