భూమా అఖిలప్రియకు బెయిల్‌ వస్తుందా?

భూమా అఖిలప్రియకు బెయిల్‌ వస్తుందా?

Bhuma Akhilapriya’s bail petition : బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏ1 నిందితురాలు.. భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరుగనుంది. సికింద్రాబాద్‌ కోర్టు అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను విచారించనుంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని… మెరుగైన వైద్యం కోసం తనకు బెయిల్‌ ఇవ్వాలని అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌లో కోరింది. దీంతో ఆమెకు సికింద్రాబాద్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తుందా.. లేదా.. అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

భూమా అఖిలప్రియ ఇంతకు ముందు కూడా బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు.. ఆమెకు బెయిల్‌ మంజూరు చేయలేదు. అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు చేస్తే ఇతర నిందితులను ఆమె ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు వాదించారు. దీంతో కోర్టు ఆమె బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇవాళ జరిగే బెయిల్‌ పిటిషన్‌ విచారణలోనూ తమ వాదనను వినిపించనున్నారు పోలీసులు. అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోరే అవకాశముంది. మరి రెండోసారైనా అఖిలప్రియకు కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తుందో లేదో.. కాసేపట్లో తేలిపోనుంది.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియను పోలీసులు ఏ1 నిందితురాలుగా చేర్చారు. ఈనెల 5వ తేదీన కిడ్నాప్‌ జరుగగా… అఖిలప్రియను 6వ తేదీన పోలీసులు అరెస్ట్‌ చేశారు. 12 రోజులుగా ఆమె రిమాండ్‌లోనే ఉంటున్నారు. అఖిలప్రియ రిమాండ్‌లో ఉండగానే…కోర్టు పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో మూడు రోజులపాటు పోలీసులు ఆమెను విచారించారు. కస్టడీలో మరిన్ని కీలక విషయాలు రాబట్టారు. కిడ్నాప్‌కు ఎలా స్కెచ్‌ వేశారు, నిందితులను ఎక్కడ ఉంచారు, కిడ్నాప్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరిపాత్ర ఏంటన్న దానిపై సమాచారం రాబట్టారు.

కస్టడీలో అఖిలప్రియ చెప్పిన సమాచారం ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమె వెల్లడించిన సమాచారం ఆధారంగా మరో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 19కి చేరింది. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్‌రామ్‌, గుంటూరు శ్రీను, జగన్‌విఖ్యాత్‌ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్‌ను తొందరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. కిడ్నాప్‌ కోసం నిందితులు వినియోగించిన వాహనాలు, సెల్‌ఫోన్స్‌, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌లో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌, సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శీను ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చారు. కూకట్‌పల్లిలోని లోధా అపార్ట్‌మెంట్స్‌లోనే కిడ్నాప్‌కు స్కెచ్‌ వేసినట్టు పోలీసులు తేల్చారు. అఖిలప్రియ, భార్గవ్‌రామ్‌, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శ్రీను ఈ నెల 2, 4 తేదీల్లో కిడ్నాప్‌కు ప్లాన్‌ రూపొందించారు.

కిడ్నాప్‌ చేసేందుకు మాదాల సిద్దార్థ్‌ అనే వ్యక్తితో 10 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్టు వెల్లడించారు. సిద్దార్థ్‌కు 5 లక్షలు, మరో 20 మందికి ఐదు లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఇందుకోసం 74వేల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించినట్టు పోలీసులు వెల్లడించారు. రెక్కీ నిర్వహించి.. పక్కాప్లాన్‌తో ముగ్గురిని కిడ్నాప్‌ చేసినట్టు తెలిపారు.