‘Bring Back The British Empire’ : భారత్‌పై విషం చిమ్ముతున్న బ్రిటీష్‌ జర్నలిస్టులు .. బ్రింగ్‌ బ్యాక్‌ బ్రిటీష్‌ అంపైర్‌ అంటూ కొత్త నినాదం

ఎలిజబెత్‌ 2 మరణం తర్వాత బ్రిటన్‌ మీడియా కొత్త నినాదం అందుకుంది. భారత్ పై విషం చిమ్ముతోంది.స్కై న్యూస్ డిబేట్‌లో బ్రిటీష్‌ జర్నలిస్టులు  బ్రింగ్‌ బ్యాక్‌ బ్రిటీష్‌ అంపైర్‌ అన్న నినాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘Bring Back The British Empire’ : భారత్‌పై విషం చిమ్ముతున్న బ్రిటీష్‌ జర్నలిస్టులు .. బ్రింగ్‌ బ్యాక్‌ బ్రిటీష్‌ అంపైర్‌ అంటూ కొత్త నినాదం

‘Bring Back The British Empire’

‘Bring back the British empire’ : ఎలిజబెత్‌ 2 మరణం తర్వాత బ్రిటన్‌కు కాస్త పైత్యం ఎక్కువైనట్లుంది. Uk జర్నలిస్టులకు అహం తలకెక్కినట్లుంది.  భారత్‌పై విషం చిమ్మడం ప్రారంభించారు. తెల్లదొరల పాలన మొదలయ్యాకే భారత్  నాగరికతకు అర్థం తెలుసుకుందంటూ కారుకూతలు కూస్తున్నారు. బ్రిటీషర్లు భారత్‌ నుంచి అడుగు బయటపెట్టినప్పటి నుంచి భారత్ పతనం మొదలైందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు స్కై న్యూస్ డిబేట్‌లో బ్రిటీష్‌ జర్నలిస్టులు  బ్రింగ్‌ బ్యాక్‌ బ్రిటీష్‌ అంపైర్‌ అన్న నినాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బ్రిటిష్ వలస పాలన భారత చరిత్రలో చీకటి అధ్యాయం.. ఇది మనం మాత్రమే చెప్పేది కాదు..! చరిత్ర పేజీలు తిరగేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మనదేశంలోని అపార వనరులను బ్రిటిషర్లు తమ దేశానికి తరలించారు. ఇది చరిత్ర కాదనలేని సత్యం. భారతీయుల రక్తాన్ని బ్రిటిష్ పాలకులు జలగల్లా పీల్చారు. మనల్ని బానిసలుగా మార్చారు. 200 ఏళ్ల పాలనలో బ్రిటిషర్లు మన దేశం నుంచి తరలించిన సంపద విలువ నేటి విలువతో పోలిస్తే అక్షరాలా 45 లక్షల కోట్ల డాలర్లు. ప్రస్తుతం బ్రిటన్ జీడీపీతో పోలిస్తే ఇది 17 రెట్లు అధికం. మన నుంచి అంత సొమ్ము దోచుకుని.. అంతలా మనల్ని వాడుకుని.. ఇప్పుడు మనకే నీతులు చెప్తున్నారు బ్రిటీషర్లు. వాళ్ల కాలంలోనే మనం నాగరికతకు అర్థం తెలుసుకున్నట్లు, వాళ్ల కాలంలోనే అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇదేదో ఓ 70 ఏళ్ల క్రితం అనుంటే ఎవరో ఒకరిద్దరైనా నమ్మేవాళ్లేమో..! కానీ భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల తర్వాత కూడా తెల్లదొరలు బలుపుతో ఇవే కూతలు కూస్తున్నారు. ఇదే ఇప్పుడు ఇండియన్స్‌ని ఆగ్రహానికి గురయ్యేలా చేస్తోంది.

క్వీన్ ఎలిజబెత్‌ 2 మరణంతో అక్కడి ప్రభుత్వ మీడియాకు సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప మరే న్యూస్ లేకుండా పోయింది. జర్నలిస్టులమని చెప్పుకుని కొందరు ప్రతిరోజూ ఏదో ఒక టీవీ ఛానల్‌లో దూరి తమ పైత్యం ప్రదర్శించడం మొదలుపెట్టారు. బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్ నెట్‌వర్క్‌లో ఇలాంటి డిబేటే ఒకటి జరిగింది. వలసపాలన అనేది పెద్ద విపత్తు అని, అది రక్తపాతం, హింస, గందరగోళానికి దారితీస్తుందని ఏదేదో మాట్లాడారు. దానికి జింబాబ్వే, ఉంగాడాతో పాటు భారత్‌-పాకిస్తాన్‌ను ఎగ్జాంపుల్‌గా చెప్పారు. బ్రిటీష్‌ పాలకులు ఎప్పుడైతే ఆ దేశాలను విడిచిపెట్టాయో ఇక అప్పటి నుంచి అంతా సర్వనాశనం అయిపోయాయి అన్నట్లుగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే బ్రిటిష్‌ పాలన నాగరికత యుగంగా చెప్పుకొచ్చారు. ఈ పిచ్చి కూతలు ఇక్కడితో ఆగిపోలేదు. బ్రింగ్‌ బ్యాక్‌ బ్రిటీష్‌ అంపైర్ అంటూ జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. అంటే దీని అర్థం అప్పుడేవైతే దేశాలు బ్రిటీష్‌ సామ్రాజ్యం కింద ఉండేవో.. ఇప్పుడు మళ్లీ వాటిని బ్రిటీష్ పాలన కిందకు తీసుకురావాలంటున్నారు. బ్రిటిష్ వలసవాదాన్ని తిరిగి రావాలని పిలుపునిస్తున్నారు. దీనిపై ఆయా దేశాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాల తర్వాత ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న దేశం భారత్.ఈ విషయంలో మనం యూకేను కూడా వెనక్కి నెట్టేశాం. పాపం ఆ డిబేట్‌లో పాల్గొన్న జర్నలిస్టులకు అంత అవగాహన లేకపోవచ్చు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోని 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థ కలిగిన అతిపెద్ద దేశంగా ఎదిగిన విషయం బ్రిటీష్‌ అజ్ఞానులకు తెలిసుండకపోవచ్చు. అన్నీ రంగాల్లోనూ అత్యున్నత ప్రగతి సాధిస్తున్న భారత్‌ను చూసి ఓర్వలేక ఇలాంటి కూతలు కూస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు.బ్రింగ్‌ బ్యాక్‌ బ్రిటీష్‌ అంపైర్‌.. అసలు అది ఎప్పుడో కూలిపోయింది. పాలన పేరుతో దోచుకునే తెల్లదొరలను అన్ని దేశాలు ఎప్పుడో తరిమికొట్టాయి.మళ్లీ ఇప్పుడు మా కింద ఉండండి మిమ్మల్ని మేం పరిపాలిస్తాం అంటే చెప్పు తెగేవరకు కొడ్తారు. బ్రిటీషర్లు పాలన పేరుతో ఎన్నో దేశాలను దోచుకుతిన్నారు. అంతెందుకు క్వీన్ ఎలిజబెత్‌ 2 ఒంటిపై ఉన్న విలువైన సంపదంతా మాదేనని గుండెలపై చేయి వేసుకుని బ్రిటీషర్లు చెప్పగలరా ? మొత్తం కాజేసిన సొమ్మని అందరికీ తెలుసు. అసలు భారత్‌ పేరెత్తి అర్హత కూడా బ్రిటన్‌కు లేదు. మన సంపద అంతా దోచుకున్నారు. డిబేట్లలో పిచ్చి కూతలు కూసే వారికి అక్కడి బ్రిటీష్‌ మ్యూజియంలో.. ఉన్న విలువైన వస్తువుల హిస్టరీ గురించి తెలుసో లేదో..! అవన్నీ ఇతర దేశాల నుంచి ఎత్తుకొచ్చినవే..! రాణి పోయాక అవన్నీ తిరిగివ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో.. ఏం చేయాలో తెలియక.. ఏం చేయాలో అర్థంకాక.. అక్కడి ప్రభుత్వం మీడియా ఏవో పిచ్చి కూతలు కూస్తోంది.

ఆ మధ్య అమెరికన్ జర్నలిస్టు కూడా భారత్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేశాడు. భారతీయులను బ్రిటిషర్లు నాగరికులను చేశారంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశాడు. బ్రిటిషర్లు భారత్‌ను వదిలి వచ్చినప్పుడు నాగరికతను, ఓ భాషను, ఓ న్యాయ వ్యవస్థను, పాఠశాలలు, చర్చిలు, ప్రజా భవనాలను వదిలేసి వచ్చారట.. అసలు మన సొమ్ముతో నిర్మించినవి మన దగ్గర ఎట్లా తీసుకుపోతారు. అమెరికా హోస్ట్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. మనం సహనం కోల్పోకుండా స్పందించలేనప్పుడు.. రియాక్ట్ అయ్యేలా ట్విట్టర్‌లో ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుండేది అని థరూర్ ట్వీట్ చేశారు. ఇతర నెటిజన్లు కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు నేరుగా బ్రిటీషర్లే విషం చిమ్మడం మొదలు పెట్టారు. బ్రిటన్‌లో ఇంకా రాచరికం అవసరమా అంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ ఏం చేయాలో తోచక అక్కడి మీడియా ఇతర దేశాలపై బురద జల్లే పనిలో పడింది.