కరోనా వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ రెడీ…తొలి జాబితాలో క్వీన్‌ ఎలిజబెత్‌

  • Published By: venkaiahnaidu ,Published On : December 6, 2020 / 08:25 PM IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ రెడీ…తొలి జాబితాలో క్వీన్‌ ఎలిజబెత్‌

Britain Gets Ready For Roll-Out Of Pfizer’s COVID-19 Vaccine కరోనా వ్యాక్సిన్ పంపిణీకి బ్రిటన్ సిద్ధమైంది. ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి బోరిస్ జాన్సన్ ప్రభుత్వం బుధవారం(డిసెంబర్-2,2020) ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అమెరికన్​ దిగ్గజ ఫార్మా సంస్థ ఫైజర్​,జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​ సంస్థలు కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిడ్ -19 మహమ్మారి నుంచి 95 శాతం రక్షణ కల్పిస్తుందని, ఇది సురక్షితమైనదని బ్రిటన్ రెగ్యులేటరీ సంస్థ ఎంహెచ్ఆర్ఏ తెలిపింది.



అయితే,కరోనా వ్యాక్సిన్​ వినియోగానికి బ్రిటన్ అనుమతిచ్చిన నేపథ్యంలో మంగళవారం నుంచి ఎంపిక చేసిన 50 కేంద్రాలలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరగనుందని బ్రిటన్ వైద్య,సామాజిక సంరక్షక శాఖ(డీహెచ్​ఎస్​సీ) తెలిపింది. బెల్జియం నుంచి ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసులు బ్రిటన్ ​కు చేరుకున్నాయని బోరిస్ ప్రభుత్వం తెలిపింది. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, కరోనాపై పోరాడుతున్న వైద్య సేవల సిబ్బంది,కేర్​ హోమ్ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని బోరిస్ ప్రభుత్వం నిర్ణయించింది.



బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే మొత్తంగా 4 కోట్ల డోసులకు ఆర్డర్ చేసింది. ఇది 2 కోట్ల మందిని వ్యాక్సినేట్ చేయడానికి సరిపోతుంది. బెల్జియం నుంచి వచ్చిన తొలి బ్యాచ్‌లో 8,00,000 డోస్ లు ఉన్నాయి. సురక్షితమైన ప్రదేశాల్లో వీటిని నిల్వ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.



కరోనా టీకా పంపిణీని చరిత్రలో అతిపెద్ద ఇమ్యునైజేషన్ కార్యక్రమంగా బోరిస్ సర్కార్ అభివర్ణిస్తోంది. నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్న నేపథ్యంలో వచ్చే వారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వైరస్ ​ని అణచివేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి. ఎన్​హెచ్​ఎస్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సమయంలో ప్రజలంతా స్థానిక నిబంధనలు పాటించాలి అని బ్రిటన్ వైద్య శాఖ మంత్రి తెలిపారు.



కాగా, మాస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం తొలిజాబితాలో క్వీన్‌ ఎలిజబెత్ ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ కూడా ఉన్నట్లు సమాచారం. వ్యాక్సిన్ ఇచ్చేందుకు రాజకుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏమీ ఇవ్వలేదని, ప్రజలకు వయసులవారీగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాజకుటుంబానికి కూడా అదే నిబంధన వర్తిస్తుందని తెలిపారు. క్వీన్ ఎలిజబెత్ వ్యాక్సిన్ తీసుకోవడం ప్రముఖ వ్యక్తులు ఆందోళనలను అధిగమించడంలో సహాయపడనున్నట్లు యూకే అధికారులు భావిస్తున్నారు.