5జీ స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఆమోదం

5జీ స్పెక్ట్రం వేలానికి కేబినెట్ ఆమోదం

Cabinet gives nod to next round of spectrum auction స్పెక్ట్రం వేలం విషయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రం వేలానికి గురువారం(డిసెంబర్-16,2020)కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​ స్పష్టం చేశారు.

20 సంవత్సరాల వ్యాలిడిటీ పీరియడ్ తో 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz మరియు 2500 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ స్పెక్ట్రంని మార్చిలో వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా రూ. 3,92,332.70 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

5జీ స్ప్రెక్ట్రం కొనుగోలు చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఈనెలలోనే ఆహ్వానిస్తామని, మార్చి2021కల్లా ఈ స్పెక్ట్రం ల వేలం ప్రక్రియ పూర్తిచేసేందుకు తాము ప్రతిపాదిస్తామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత వేలం జరిగి 4 సంవత్సరాలు అయ్యిందని తెలిపారు. 2016లో వేలంకి ఉన్న షరతులే ఇప్పుడు ఉంటాయని అన్నారు.

మొత్తం మూడు రకాలైన స్పెక్ట్రం వేలం వేయనున్నారు. అలాగే, టెలీకమ్యూనికేషన్ సెక్టార్‌లో నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఏర్పాటు చేయాలని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్ల కోసం నమ్మకమైన, సర్వీసుదారులను, ఉత్పత్తుల జాబితాను కేంద్రం ప్రకటించనుంది.

మరోవైపు చెరకు రైతులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతి చేసే వారికి టన్నుకు రూ.6000 చొప్పున సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ చెప్పారు. దీని వల్ల 5 కోట్ల మంది రైతులు, 5 లక్షల మంది సుగర్ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు లాభం జరుగుతుందని అంచనా వేశారు. రైతులకు మూడు విడుతల్లో ఈ సబ్సిడీని అందించనున్నారు.