Cabinet Reshuffle : మోదీ కేబినెట్ లో ఆ ఇద్దరు రెబల్స్..రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించి కేంద్రంలోకి

కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 43మందిలో మధ్యప్రదేశ్, బిహార్​ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్​ లు కూడా ఉన్నారు.

Cabinet Reshuffle : మోదీ కేబినెట్ లో ఆ ఇద్దరు రెబల్స్..రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించి కేంద్రంలోకి

Cabinet3

Cabinet Reshuffle కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఇవాళ రాష్ట్రపతి భవన్ లో కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 43మందిలో మధ్యప్రదేశ్, బిహార్​ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్​ లు కూడా ఉన్నారు. అయితే కేంద్రమంత్రులుగా అవకాశం దక్కడానికి ముందు ఈ ఇద్దరు నేతలు తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. జ్యోతిరాధిత్య సింధియా కారణంగా మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. ఎల్జేపీకి అధ్యక్షుడిని తానే అని ప్రకటించి ఆ పార్టీలో సంక్షోభానికి తెరలేపారు పశుపతి కుమార్ పరాస్​.

జ్యోతిరాధిత్య సింధియా కారణంగా మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి.. బీజేపీ అధికారం చేజి​క్కించుకోగలిగింది. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230 సీట్లకు గాను 114 స్థానాలు గెలిచి ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్​పై పార్టీపై అసంతృప్తితో తిరుగుబావుటా ఎగురవేసిన సింధియా తన వర్గం 25 మంది ఎమ్మెల్యేలతో కలిసి మార్చి 2020లో బీజేపీలో చేరారు. ఫలితంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన తన అనుచరుల్లో చాలా మందిని సింధియా గెలిపించుకున్నారు. ఇక, 2020లో కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరిన తర్వాత సింధియాకు కొద్ది నెలల్లోనే రాజ్యసభ ఎంపీగా అవకాశం దక్కింది. ఇప్పుడు మోదీ మంత్రివర్గంలో చోటు లభించింది.

ఇక,బీహార్‌ ఎన్నికలకు ముందు ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్‌ పాసవాన్‌ చనిపోగానే ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ నేతృత్వంలో ఒంటరిగా బరిలోకి దిగిన ఎల్జేపీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే అప్పటినుంచి చిరాగ్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన బాబాయ్ మరియు ఎంపీ అయిన పశుపతి కుమార్ పరాస్.. ఇటీవల ఎల్జేపీ నూతన అధ్యక్షుడిని తానే అని ప్రకటించి బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. పార్టీ పీఠం నుంచి చిరాగ్​ను తొలగించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. మోదీ నూతన కేబినెట్​లో పశుపతి పరాస్​కు చోటు దక్కింది. 71 ఏళ్ల పశుపతి ఆరుసార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు.