పంచాయితీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది

పంచాయితీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది

పంచాయితీ ఎన్నికల ఫలితాలు వైసీపీ పతనానికి నాందియని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పంచాయితీ ఎన్నికల సమయంలో ప్రజలు వీరోచితంగా పోరాడారని, ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ముందుకు వచ్చిన ప్రజలను, కార్యకర్తలను అభినందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు. పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రాత్రి 10గంటల వరకు.. తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని, 10గంటల తర్వాత చీకటి రాజ్యం మొదలైందని, అప్పటి నుంచి ఇష్టం వచ్చినట్లు ప్రతీచోట కరెంట్ కట్ చేసి వైసీపీ వాళ్లు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు.

భయపెట్టినా.. బాధపెట్టినా.. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎక్కడా తగ్గలేదని అన్నారు. రెండవ విడతలో 1033పంచాయితీలు అంటే 37. 67శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని అన్నారు చంద్రబాబు. టీడీపీ అలయన్స్ 65స్థానాల్లో గెలిచారని, 2.37శాతంగా ఉందని అన్నారు. బూతుల మంత్రి సొంత ఊరిలోనూ, పిల్లి సుభాష్ సొంతగ్రామంలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి సొంత గ్రామం మర్రిపాడులోనూ టీడపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచారని అన్నారు.

పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. వైసీపీ బేస్ కంపిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేస్తోందని అన్నారు. చీకటి రాజకీయాలకు వైసీపీ తెరతీస్తోందని, నల్ల చట్టాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఎమ్మెల్యేలు వాలంటీర్లకు శిక్షణలు ఇచ్చారని, ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చెయ్యాలని మీటింగ్‌లు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. ఏజెంట్లను బయటకు పంపేసి ఓట్లు వాళ్లే వేసుకునే పరిస్థితికి వైసీపీ వాళ్లు వచ్చారని అన్నారు.