ఇంకా ఎంతమందిని చంపుతారు? పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

ఇంకా ఎంతమందిని చంపుతారు? పట్టాభిపై దాడిని ఖండించిన చంద్రబాబు

chandrababu condemn attack on tdp leader pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. చంపాలనే పట్టాభిపై దాడి చేశారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని, వైసీపీ నేత‌లు గూండాల్లా త‌యారయ్యారని, చంద్రబాబు ఫైర్ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని గురునాన‌క్ న‌గ‌ర్‌లో ఉన్న‌ ప‌ట్టాభి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను ప‌రామ‌ర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

‘రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారు. వైసీపీ నేత‌లు గూండాల్లా త‌యారయ్యారు. వారికి క‌ళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగ‌ల‌మ‌ని భావిస్తున్నారు. కొంతమంది క‌లిసి ఓ ప‌థ‌కం కూడా వేశారు. ప‌ట్టాభిపై దాడికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి’ అని చంద్ర‌బాబు అన్నారు.

‘ప్ర‌భుత్వ అవినీతిని ప‌ట్టాభి ప్ర‌శ్నిస్తున్నారు అందుకే ఆయ‌న‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. వైసీపీ నేత‌లు బ‌రి తెగించి దాడులు చేస్తున్నారు. ప‌ట్టాభిని చంపాల‌నే దాడి చేశారు. ఇంత‌కు ముందు కూడా ప‌ట్టాభిపై దాడి జ‌రిగింది. ఈ కాల‌నీలో ప్ర‌తి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి’ అని చంద్ర‌బాబు అన్నారు.

‘దీన్ని బ‌ట్టి ఆ ప్రాంతంలో దాడులు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని తెలుసుకోవ‌చ్చు. ప‌ట్టాభిని చంపే ప్ర‌య‌త్నం చేశారు. ఇనుప రాడ్లు, ఇత‌ర మార‌ణాయుధాల‌తో దుండ‌గులు వ‌చ్చి దాడి చేశారు. డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు లాగేశారు. ప‌ట్టాభి బ‌లంగా ఉంటారు కాబ‌ట్టి త‌ట్టుకోగ‌లిగారు. వేరే వార‌యితే త‌ట్టుకోలేక‌పోయే వారు. వైసీపీ నేత‌లు ఏమ‌నుకుంటున్నారు?’ అని చంద్ర‌బాబు మండిపడ్డారు.

‘ఈ దాడి ఘ‌ట‌న‌ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్ప‌ష్టంగా రికార్డ‌య్యాయి. ఓ వైపు దేవాల‌యాల‌పై దాడులు చేస్తున్నారు. మ‌రోవైపు, నేత‌ల‌పై దాడులు చేస్తున్నారు. టీడీపీ నేత‌లంద‌రూ వైసీపీ దాడుల‌ను ఎండ‌గ‌డుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లు టీడీపీ నేత‌ల‌పై దాడుల‌కు దిగుతున్నారు. ఇది పులివెందుల కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవా‌లి’ అని చంద్ర‌బాబు హెచ్చరించారు.

‘దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓ వైపు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇక్క‌డ ప‌ట్టాభిపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్ర‌జ‌ల‌పై దాడి. ప్ర‌జ‌ల కోసం పోరాడుతోన్న వారిపై దాడులు చేస్తారా? ఎంత మందిని చంపుతారు? చ‌ంపేస్తారా అంద‌ర్నీ? చ‌ంపండి చూస్తాం. ఖ‌బ‌డ్దార్ జాగ్ర‌త్త‌గా ఉండండి’ అని చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు.

‘మీ బూతు మంత్రులకు చెప్పుకో జ‌గ‌న్.. ఇటువంటివి జ‌రిగితే చూస్తూ ఊరుకోబోము. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎక్క‌డైనా ఇటువంటి దాడులు జ‌రిగాయా? మా నేత‌లు ఎవ‌రైనా తప్పుగా మాట్లాడితేనే నేను వారిని కంట్రోల్ చేసేవాడిని. గ‌తంలో టీడీపీ నేత‌ల‌పై దాడులు జ‌రిగితే డీజీపీ స‌రైన రీతిలో స్పందిస్తే ఇప్పుడు మ‌ళ్లీ దాడి జ‌రిగేవి కాదు’ అని చంద్ర‌బాబు అన్నారు.

అవినీతి పాలనను ఎండగడుతున్నారని జగనే దాడులు చేయిస్తున్నారు: నారా లోకేశ్
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. పట్టాభిపై వైసీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఆధారాలతో సహా జగన్ అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. పట్టాభిపై కక్షతో జగన్ రెడ్డే ఈ దాడులు చేయిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు.

మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడతాం అని బెదిరించడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభికి వైసీపీ మంత్రులే వార్నింగ్ ఇచ్చి మరీ గూండాలతో దాడి చేయించారంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోందని వివరించారు. మీ బెదిరింపులకు అదిరిపోయేది లేదు, మీ దాడులకు బెదిరిపోయేది లేదు… మీ అరాచక పాలనను అంతమొందించి తీరుతామని లోకేశ్ స్పష్టం చేశారు.

టీడీపీ నేత‌ పట్టాభిపై మంగళవారం(ఫిబ్రవరి 2,2021) విజయవాడలో దాదాపు 10 మంది దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. ప‌ట్టాభి తన ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరగానే రాడ్ల‌తో ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. రులో ఉన్న‌ పట్టాభికి గాయాలయ్యాయి.

దుండగులు రాడ్‌లతో దాడి చేశార‌ని ప‌ట్టాభి తెలిపారు. అలాగే, త‌న డ్రైవర్‌ను కూడా వారు గాయపరిచారని తెలిపారు. దాడులు చేసిన‌ప్ప‌టికీ, భయపడనని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాన‌ని చెప్పారు. త‌నపై జ‌రిగిన దాడి ప‌ట్ల‌ డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. 6 నెలల క్రితం కూడా త‌న కారుపై దాడి జరిగిందని, అయిన‌ప్ప‌టికీ ఆ దాడిపై ఇప్పటికీ చర్యలు లేవ‌ని అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్ర‌మాల‌ను బయటపెడుతున్నందుకే త‌న‌పై దాడులు చేస్తున్నార‌ని ప‌ట్టాభి అన్నారు. ఏపీలో శాంతిభద్రలు ఎలా దిగ‌జారిపోయాయో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయ‌న చెప్పారు. వైసీపీ నేతలు ప్ర‌జ‌ల‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.