ఆ ఇద్దరు టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

ఆ ఇద్దరు టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

chandrababu warning for tdp leaders: విజయవాడ టీడీపీలో వ్యక్తిగత విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విభేదాలతో వీరు రోడ్డెక్కారు. వీరిద్దరి తీరు పార్టీకి తలనొప్పిగా మారింది. పరిస్థితి చేయి దాటుతున్నట్టు కనిపించడంతో అధినేత చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆ ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ గురించి మాట్లాడినా, వ్యక్తిగత విమర్శలు చేసుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటే పార్టీకి ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు అన్నారు.

వివాదం ఏంటంటే..
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 39వ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గుండారపు పూజితను కాదని… వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి కేశినేని నాని టికెట్ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. నాని నిర్ణయంపై బుద్దా వెంకన్న వర్గీయులు మండిపడ్డారు. కేశినేని నానిని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజితలు అడ్డుకుని నిలదీశారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న తమను కాదని, ఇతరులకు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం సబబు కాదని మండిపడ్డారు.

కొంతకాలంగా కేశినేని నానికి, ఇతర స్థానిక నేతలైన బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితరులకు దూరం పెరుగుతూ వస్తోంది. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో చివరకు చంద్రబాబు రంగంలోకి దిగారు. 39వ డివిజన్ అభ్యర్థి అంశాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.

కాగా, చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘నాకు చంద్రబాబు ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. దయ చేసి తప్పుడు వార్తలు ప్రచరించ వద్దు’ అని కేశినేని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థుల తరపున నాని ప్రచారం చేస్తున్నారు.

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల వేళ టీడీపీలో గ్రూప్ వార్ బయటపడింది. వన్ టౌన్ నాలుగు స్తంభాల సెంటర్ లో 39వ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ కేశినేని నానిని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీ మారిన వాళ్ళని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని ప్రశ్నించారు. కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోలేదని.. అలాంటి వారి తరపున ఎలా ప్రచారం చేస్తారో చెప్పాలన్నారు. ఒకే చోట ఇద్దరు కార్పొరేటర్ అభ్యర్ధులను ఎలా పెడతారని ప్రశ్నించారు.

టీడీపీ కార్యకర్తల్ని ఎంపీ నాని వారించే ప్రయత్నం చేశారు. తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తెచ్చుకున్నారని.. వాళ్లలో కొంతమంది గతంలో తిట్టినవారే కదా అన్నారు. అది తప్పు కాదా అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఎవరు తప్పు చేసినా వారిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చని.. ఇలా నడిరోడ్డుపై అడ్డుకొని వాగ్వాదం చేస్తే పార్టీకే నష్టం అన్నారు. 39 డివిజన్ నుంచి పూజిత పోటీలో ఉండగా.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన శివ కుమార్‌‌ను కేశినేని వర్గం ప్రోత్సహిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

అసలే.. వరుస రాజీనామాలు, వలసలతో కుదేల్ అయిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఈ వ్యవహారం మరింత ఇబ్బందికరంగా మారిందని తమ్ముళ్లు వాపోతున్నారు.