చికెన్ ప్రియులకు షాక్, అమాంతం పెరిగిన ధరలు

చికెన్ ప్రియులకు షాక్, అమాంతం పెరిగిన ధరలు

chicken rates sudden hike: తెలంగాణలో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగాయి. కొన్నాళ్ల క్రితం బర్డ్ ఫ్లూ ప్రచారంతో పడిపోయిన చికెన్ ధర..మళ్లీ చుక్కలను తాకుతోంది. వారం వ్యవధిలో కిలో చికెన్‌ పై రూ. 50 నుంచి రూ. 70 పెరిగింది. గత వారం స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర కిలో రూ.160-180గా ఉంది. ఆదివారం(మార్చి 7,2021) కిలో ధర ఏకంగా రూ. 220-250 వరకు పలికింది. ఒక్క వారంలోనే ఇంత భారీగా ధరలు పెరుగడంతో సామాన్యులకు మింగుడు పడటం లేదు. బోన్‌లెస్‌ చికెన్‌ ధర కిలో రూ.350-370 ఉండడం గమనార్హం.

చికెన్‌ ధరలు అమాంతంగా పెరగటంపై పౌల్ట్రీ వ్యాపారులు స్పందించారు. ”ధరల పెరుగుదలకు బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంది. జనవరిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం నెలకొన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో లేకపోయినా.. బర్డ్‌ఫ్లూ భయం పౌల్ట్రీని భారీగానే దెబ్బకొట్టింది. ఫలితంగా చాలా మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకం ఆపేశారు. ఫలితంగా ఒక్కసారిగా ఉత్పత్తి పడిపోయింది. అదే సమయంలో డిమాండ్ పెరిగింది. దీంతో అనివార్యంగా ధరలు పెరిగాయి. చికెన్‌ ధరల పెరుగుదల ఈ నెలాఖరు వరకు ఉంటుంది’ అని చెప్పారు.

మొత్తంగా కోడి కూర ఘాటెక్కింది. పెరిగిన ధరలు చికెన్ ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలా ఉండగా, గత రెండేళ్ల కాలంలో పౌల్ట్రీ రైతులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు. కరోనా కారణంగా కోళ్ల పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి పడింది. దీనికి తోడు చికెన్ తినొద్దంటూ వస్తున్న పుకార్లు కూడా ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బకొట్టాయి.