WHOని చైనా బెదిరించింది..CIA రిపోర్ట్ లో సంచలన విషయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2020 / 09:55 AM IST
WHOని చైనా బెదిరించింది..CIA రిపోర్ట్ లో సంచలన విషయాలు

కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)పై,చైనాపై అగ్రరాజ్యంతో సహా పలుదేశాలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వో, ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి కారణం చైనాయేనని బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఓ అడుగు ముందుకేసి డబ్యూహెచ్ వో కి నిధులు ఆపేశారు. కరోనా వైరస్ ను చైనీస్ వైరస్ అని పిలవడం మొదలుపెట్టారు. నిత్యం చైనాపై ఘాటైన పదజాలంతో ట్రంప్ విరుచుకుపడుతున్నారు. చైనా అంటేనే ఆయనకు చిర్రెత్తుకొస్తుంది.

అయితే ఈ సమయంలో అమెరికా నిఘా సంస్థలు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. కోవిడ్ -19విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)ను చైనా బెదిరించినట్టు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(CIA)తెలిపింది.వైరస్‌ విషయమై ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా…WHOని నిలువరించేందుకు చైనా ప్రయత్నించినట్టు తెలిపింది. 

WHOని చైనా బెదిరించినట్టు ఆరోపిస్తూ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక వెల్లడించడం ఇది రెండోది. తొలిసారి జర్మనీ నిఘా సంస్థ డెర్‌ స్పైగల్ కూడా తన నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌పై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. కరోనా వైరస్‌ ను అంటువ్యాధిగా ప్రకటించడానికి తొమ్మిది రోజుల ముందు జనవరి 21న జిన్‌పింగ్ వ్యక్తిగతంగా ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పుడు CIA తన లేటెస్ట్ రిపోర్ట్ లో…. కరోనా వైరస్ విషయమై ప్రపంచ వ్యాప్త హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తే… తమ సహకారాన్ని నిలిపేస్తామని WHOని  జనవరిలో డ్రాగన్ దేశం బెదిరించినట్టు వివరించింది. అంతేకాదు, డబ్ల్యూహెచ్ఓ మౌనంగా చోద్యం చూడటంతో ఇతర దేశాల నుంచి చైనా భారీగా ఔషధాలు, వైద్య పరికరాలను దిగుమతిచేసుకుందని తెలిపింది. WHOని చైనా బెదిరించినట్టు ఆరోపిస్తూ అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక వెల్లడించడం ఇది రెండోది.

కరోనా వ్యాప్తికి చైనాయే బాధ్యత వహించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే డిమాండ్‌ చేస్తున్న క్రమంలో ఈ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా, వైరస్‌ విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, తమ అధ్యక్షుడు టెడ్రోస్‌ మధ్య గత జనవరిలో ఫోన్‌ సంభాషణ జరిగిందన్న వార్తలను కూడా డబ్ల్యూహెచ్‌వో ఖండించింది.
 

Read Here>> endemic గా మారనున్న కరోనా మహమ్మారి…WHO కీలక వ్యాఖ్యలు