చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి డొనేషన్లు : కాంగ్రెస్-చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఒప్పందం కుదిరిందా?

  • Published By: venkaiahnaidu ,Published On : June 25, 2020 / 02:52 PM IST
చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి డొనేషన్లు : కాంగ్రెస్-చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య ఒప్పందం కుదిరిందా?

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం(జూన్-25,2020) కాంగ్రెస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు సమకూరుస్తోందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లడఖ్ సరిహద్దులో  భారత్, చైనా మధ్య  తీవ్ర ఉద్రిక్తత సమయంలో  గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ ఆరోపణలు చేశారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్(RGF) ప్రెసిడెంట్  గా ఉండగా,  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మన్మోహన్ సింగ్, పి చిదంబరం ఈ ఫౌండేషన్ బోర్డులో ఉన్నారు.

RGF వార్షిక నివేదిక ప్రకారం, 2005-06లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా రాయబార కార్యాలయం నుండి విరాళం అందుకుంది. ఆ తరువాత వెంటనే  భారతదేశం మరియు చైనా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ((FTA) ఎలా కోరదగినది మరియు అవసరమైనది అనే దానిపై రాజీవ్ గాంధీ ఫౌండేషన్  ఒక అధ్యయనం చేసింది.

తాము లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇవ్వాలని ఇవాళ విలేకరుల సమావేశంలో రవిశంకర్  ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ ఏదైనా దాచిపెడుతుందా? కాంగ్రెస్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందా అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. అయితే,కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా బిజెపి వాదనలను తిప్పికొట్టారు. నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించే ప్రయత్నంగా దీనిని పేర్కొన్నారు.