Chiranjeevi: టీఎన్ఆర్ కుటుంబానికి మెగా సాయం.. సంపూ కూడా!

Chiranjeevi: టీఎన్ఆర్ కుటుంబానికి మెగా సాయం.. సంపూ కూడా!

Chiranjeevi

Chiranjeevi helps TNR’s family:

తెలుగు సినిమా నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల సాయం.. తక్షణ ఖర్చుల కోసం అందజేశారు. సంతోషం సురేష్ కొండేటి ద్వారా లక్ష రూపాయలను టీఎన్ఆర్ ఇంటికి పంపించారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు.

టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేసే విధానం తనను ఎంతో ఆకట్టుకునేదని గుర్తుచేశారు. జీవితంలో పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కుటుంబానికి ఎలాంటి అవసరమొచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.


మీరంటే వీరాభిమానం: చిరుతో టీఎన్ఆర్ భార్య
మీరంటే టీఎన్ఆర్ గారికి వీరాభిమానం సార్. తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారు. ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు. మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో ధైర్యంగా అనిపించిందని టీఎన్ఆర్ భార్య అన్నారు. తమ కుటుంబానికి లక్ష రూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేసినందుకు మెగాస్టార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా తనవంతుగా రూ. 50వేలను టీఎన్ఆర్ భార్యకు అందజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో.. “తెలుగు సినిమా జర్నలిస్టు TNR గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాసిట్ చెయ్యటం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సాయం తప్పక చేయగలను. మీరు సపోర్ట్ చెయ్యండి” అంటూ ట్వీట్ చేశారు సంపూర్ణేష్ బాబు.

దేవదాస్ కనకాల వద్ద డైరక్షన్‌లో మెలకువలు నేర్చుకున్నటీఎన్ఆర్.. ఆ తర్వాత ప్రముఖ నటుడు ఎల్‌బీ శ్రీరామ్ వద్ద సహ రచయితగా పని చేశారు. అయితే ‘ఫ్రాంక్లీ విత్ TNR’ అనే షోతో పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇంటర్య్వూ చేశారు. మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పలువురి చేత భేష్ అనిపించుకున్న ఆయన.. పలు సినిమాల్లోనూ నటించారు.