తిరుపతి సీటుపై క్లారిటీ.. బీజేపీ అభ్యర్థి ఎవరు?

తిరుపతి సీటుపై క్లారిటీ.. బీజేపీ అభ్యర్థి ఎవరు?

Clarity On Tirupati Seat Who Is The Bjp Candidate1

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి.. అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్‌ వినిపించిన పవన్ కళ్యాణ్.. పాలిటిక్స్‌లో కూడా అదే పంథాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు‌. ప్రతిష్టాత్మక తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయిలో ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్.. కమలానికే ఆ బాధ్యతలు అప్పచెప్పేశారు.

పొత్తులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ.. కేంద్రాన్ని కోరిన జనసేనానికి మళ్లీ నిరాశే ఎదురైంది. తిరుపతి లోక్ సభ సెగ్మెంట్ ఉపఎన్నికలో మిత్రులుగా కొనసాగుతోన్న బీజేపీ, జనసేన పార్టీలు.. అక్కడ పోటీ చేసేందుకు తీవ్రంగా పొటీపడ్డారు. పోటీలో ఉండేది మేమంటే మేమేనంటూ రెండు పార్టీల అధ్యక్షులూ ప్రకటనలు చేసేశారు. చివరికి ఢిల్లీలో జరిగిన పంచాయితీలో ఎవరు పోటీ చేయాలనేదానిపై జాయింట్ కమిటీ ఏర్పాటైంది.

రెండునెలల సుదీర్ఘ మంతనాల తర్వాత కమిటీ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చేసింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే బరిలోకి దిగాలని, వారికి జనసేన మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాయి.

పవన్‌తో భేటీ తర్వాత..
ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దియోధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజులు జనసేనాని పవన్ కళ్యాణ్‌తో తుది భేటీ తర్వాత.. అభ్యర్ధిత్వంపై క్లారిటీ ఇచ్చారు. ఉపఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటారని, మిత్రపక్షంగా జనసేన మద్దతు బీజేపీకి కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. దీంతో.. తిరుపతి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పవన్‌కు నిరాశే ఎదురైనట్లయింది.

పోటీపై క్లారిటీ వచ్చిన వెంటనే అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. బీజేపీ ముందు నుంచీ.. పదవీ విరమణ చేసిన అధికారులు, న్యాయమూర్తులను వెతుకుతోంది. గతంలో బీజేపీ తరుపున పోటీ చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి విజయం సాధించారు. అదే సీన్‌ రిపీట్ చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు రేసులో ముందున్నారు. హిందూ ధార్మిక ప్రచారం, ఆలయాల అభివృద్ధి, గో సంరక్షణ వంటి కార్యక్రమాల్లో తనదైన పాత్ర పోషిస్తూ దాసరి శ్రీనివాసులే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్ధి కావొచ్చేనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.

దాసరి శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది రిటైర్డ్ అధికారుల పేర్లను కూడా బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్, పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి బాలయోగి తదితరుల పేర్లు బీజేపీ దృష్టిలో ఉన్నాయ్‌. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన రావెల కిషోర్‌ బాబు కూడా కమలం పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. మరోవైపు.. కూటమి తీసుకున్న నిర్ణయాన్ని జనసేన కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే చర్చ ఉత్కంటగా మారింది.

గతేడాది చివర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా పవన్ కల్యాణ్ సంచలనం రేపారు. జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రన జనసేనకు సొంత అస్థిత్వం ఉండదా? అంటూ ఎదురు ప్రశ్నలు సంధించిన వకీల్‌ సాబ్‌.. జీహెచ్ఎంసీలో అభ్యర్థులను కూడా ప్రకటించారు. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లి బుజ్జగించిన తర్వాత పోటీ నుంచి తప్పుకున్నారు. జీహెచ్ఎంసీలో త్యాగానికి ప్రతిఫలంగా తిరుపతిలో పోటీకి జనసేనకు అవకాశం కల్పించాలని బీజేపీ పెద్దలను కోరుతానని స్వయంగా ప్రకటించారు పవన్. కానీ చివరికి ఆ సీటులోనూ బీజేపీనే బరిలోకి దిగడం ఖరారవడంతో.. హరిహర వీరమల్లుకు మళ్లీ నిరాశే ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నగారా మోగించింది. ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటే తిరుపతి ఎంపీ సీటుకూ ఉప ఎన్నిక నిర్వహిస్తామన్న ఈసీ.. ప్రక్రియ తేదీలను అతి త్వరలోనే ప్రకటించనుంది. ఏపీలోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్‌ విడుదల కాలేదు.