నెలల నిండకముందే పుట్టేస్తున్న శిశువులు..అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..!!

నెలల నిండకముందే పుట్టేస్తున్న శిశువులు..అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..!!

Climate change is leading to premature births : అమ్మ కడుపులో పిండంగా రూపుదిద్దుకున్న శిశువు తొమ్మిది నెలలకు ఈ లోకంలోకి వస్తుంది. అంటే బిడ్డలు గర్భంలో తొమ్మిది నెలలు పూర్తి అయ్యాక పుడతారు. కానీ రోజులు మారాయి. పర్యావరణంలో తీవ్ర పరిణామాలు వచ్చాయి. వస్తున్నాయి. దీంతో బిడ్డలు తొమ్మిది నెలలు నిండకుండానే పుట్టేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పర్యావరణ మార్పులే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన లాంకాస్టర్ యూనివర్శిటీ, ఫియోక్రజ్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.

బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతంలో 2006 నుంచి 2017 మధ్యకాలంలో జన్మించిన మూడు లక్షల మంది చిన్నారులు డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేయగా ఈ వాస్తవాలు బైటపడ్డాయి. ఈ శిశువులు నెలలు నిండకముందే పుట్టేయటం వల్ల పుట్టినప్పుడు తగినంత బరువు లేరు. దీనికి ఆ ప్రాంతంలో అధికశాతంలో కురిసిన వర్షపాతమే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీనితో పాటు కుటుంబాల్లోని ఆర్థిక, అనారోగ్య పరిస్థితులు కూడా కారణమని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అమెజాన్‌ ప్రాంతంలో భారీ వర్షపాతం కారణంగా పంటలు దెబ్బతింటాయి. దీంతో స్త్రీలకు సరైన పోషకాహారం లభించదు. అటువంటి సమయంలో వారు గర్భం ధరించినా..ఆ ప్రభావం కడుపులో పెరిగే శిశువులపై ఉంటుంది. పైగా వరదల వల్ల ఆయా ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి ఉంటుంది. దీంతో పలు రకాల వ్యాధులు సంక్రమిస్తుంటాయని..అలాగే వరదల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

వీటి ప్రభావంతో గర్భిణులు కూడా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని ఇవన్నీ కలిసి పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని..దీంతో శిశువులు తల్లి గర్భంలో నెలలు నిండకముందే పుట్టేందుకు అవకాశాలున్నాయని వెల్లడించారు. అడవుల నరికివేత కారణంగా పర్యావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడైనా గానీ కరవులు, ప్రకృతి వైపరీత్యాలుగానీ కారణమేమైనా గానీ..ఏ పరిస్థితులైనా సరే ముందుకు ప్రభావం పడేది మహిళలపైనే ఉంటుంది. అమెజాన్ ప్రాంతంలో పెరుగుతున్న గ్లోబర్ వార్మింగ్ కారణంగా ఇటీవలి దశాబ్దాల్లో వరదలు, కరవు రెండూ పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మహిళలమీదా..వారికి పుట్టే బిడ్డల మీద పడుతోంది.

మెజాన్ బేసిన్లో వరదలు ఒక శతాబ్దం క్రితం కంటే ఈరోజు ఐదు రెట్లు ఎక్కువయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో నగరాలు నీటిలో మునిగిపోయాయి..100,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ఇలా పలు కారణాలు పర్యావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఇవన్నీ పుట్టబోయే బిడ్డలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో బిడ్డలు నెలలు నిండకుండానే ముందే పుట్టేయటానికి కారణాలు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.