వాలంటీర్ లలిత కుటుంబానికి సీఎం జగన్ రూ.50లక్షల సాయం

వాలంటీర్ లలిత కుటుంబానికి సీఎం జగన్ రూ.50లక్షల సాయం

cm jagan give 50 lakhs to volunteer lalitha family: శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వికటించి వాలంటీర్‌ పిల్లా లలిత(28) మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్‌ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వాలంటీర్లు, వీఆర్వో ప్రసాద్‌ ఫిబ్రవరి 5న వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ ట్యాబ్లెట్లు వేసుకుంది. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 7న తెల్లవారుజామున మృతి చెందింది.

లలిత మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే లలిత మృతి చెందడంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని ఆరోపించారు. లలితకు భర్తతో పాటు ఎనిమిదేళ్ల కొడుకున్నాడు. బిడ్డను కోల్పోయి తీవ్ర విషాంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. కుటుంబానికి అన్ని విధాలుగా సాయంగా ఉంటామని హామీ ఇచ్చింది. అంతేకాదు రూ.50లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది.