అమరావతి ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

అమరావతి ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

cm jagan good news for amaravati locals: రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులపై సోమవారం(ఫిబ్రవరి 8,2021) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కరకట్ట రోడ్డుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఇందుకు రూ.150 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. అమరావతి ప్రాంతం అభివృద్ధికి ఎంతో కీలకమైన కరకట్ట రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. ఇక సీడ్ యాక్సిస్ రోడ్డును మెయిన్ రోడ్డుతో అనుసంధానం చేసే పనులను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు.

అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలతో పాటు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ను త్వరగా కంప్లీట్ చేయాలని, ప్లాట్లను సిద్ధం చేయాలని అన్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా అసంపూర్తిగా ఉన్న భవనాలను వేగంగా పూర్తి చేయాలని జగన్ స్పష్టం చేశారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాల పురోగతి, అయిన వ్యయం.. భవనాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. నిధుల లభ్యతపై పూర్తి స్పష్టతతో ఉండాలని అధికారులకు ఆదేశించారు.

విశాఖపట్నంలోని సముద్రతీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై జగన్ చర్చించారు. ఇదే భూమిని గత ప్రభుత్వం లూలూ గ్రూపుకు అతి తక్కువ ధరకు 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖకు తలమానికంగా ఉండేలా అధికారులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌బీసీసీ, ఏపీఐఐసీ ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. కమర్షియల్ ప్లాజా రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.1,450 కోట్ల నికర ఆదాయం వస్తుందన్న ఎన్‌బీసీసీ అధికారులు తెలిపారు.