వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త

వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త

cm jagan good news for volunteers: గ్రామ/వార్డు సచివాలయ వాలంటీర్లకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. వారిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నారు. పురస్కారాలతో సత్కరించాలని నిర్ణయించారు. ఉత్తమ పనితీరు కనబరిచే వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించే కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు సీఎం జగన్. మెరుగైన సేవలు అందిస్తున్న వాలంటీర్లను తప్పకుండా ప్రోత్సహించాలని చెప్పారు. వారు అందించిన సేవల స్థాయిని బట్టి సేవారత్న, సేవామిత్ర వంటి పురస్కారాలతో గౌరవించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్ర ప్రణాళిక శాఖపై ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాలంటీర్ల అంశాన్ని చర్చించారు.

అలాగే అధికారులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయంలో కూడా డేటా క్రోడీకరణ ఒకరికి అప్పగించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఈ బాధ్యతలు అప్పగించాలని, మండల స్థాయిలో ఉన్న ఉద్యోగి దీన్ని సూపర్‌‌వైజ్‌ చేస్తారని వివరించారు.

అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న డేటాను స్వీకరించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఆర్బీకేల పరిధిలో చేస్తున్న ఈ-క్రాపింగ్‌ లాంటి డేటాను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ-క్రాపింగ్‌ జరుగుతుందా? లేదా? అనే దానిపై దృష్టి పెట్టగలుగుతామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు.. ఇలా గ్రామాల్లోని ప్రభుత్వ వ్యవస్థల వద్ద ఇంటర్నెట్‌ సరిగ్గా పనిచేస్తుందా? లేదా? అన్న డేటా కూడా ఎప్పటికప్పుడు రావాలన్నారు. దీనివల్ల పాలన, పనితీరు సమర్థవంతంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయా? అని అధికారులను అడిగారు సీఎం జగన్. దీనిపై అధికారులు చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని సీఎం వారికి పలు సూచనలు చేశారు. సుస్థిర గ్రామాభివృద్ధి కోసం లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఐక్యరాజ్యసమితితో పాటు దాని అనుబంధ విభాగాలు, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, యునెస్కో వంటి సంస్థలతో కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు.