ఏలూరులో వింత వ్యాధిపై సీఎం జగన్‌ ఆరా..

  • Published By: bheemraj ,Published On : December 6, 2020 / 10:41 AM IST
ఏలూరులో వింత వ్యాధిపై సీఎం జగన్‌ ఆరా..

cm jagan inquire eluru strange disease : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. నిన్న రాత్రి నుంచి పడమర వీధి, దక్షిణపు వీధి, కొబ్బరితోట, గన్ బజార్, శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే కింద పడుతున్నారు. ఇలా రెండ్రోజుల వ్యవధిలోనే 155 మంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.



బాధితుల్లో 55 మంది మహిళలు, 27మంది చిన్నారులు, 60 మంది పురుషులున్నారు. మరోవైపు ఏలూరు ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని… తాజా పరిస్థితిని సీఎంకు వివరించారు. ప్రభుత్వాస్పత్రుల్లో బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని జగన్‌ భరోసా ఇచ్చారు.



ఏలూరులో బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. జిల్లా కలెక్టర్ ఏలూరు మున్సిపల్ ఆఫీస్‌లో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వెంటనే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అయితే త్రాగునీరు కలుషితం వల్లే ఇలా జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో బాధితల కోసం కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.



అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది మాత్రం ఇప్పటీ వరకు అధికారులు చెప్పలేకపోతున్నారు. బాధితుల నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ రిపోర్టులు ఇంకా రాకపోవడంతో ప్రజల్లోనూ టెన్షన్ పెరిగిపోతుంది.

ప్రజలు కళ్లు తిరిగి పడిపోవడంపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ స్పందించారు. వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఇలా జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పారు. అయితే దీనిపై తుది రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. ప్రజలు కంగారు పడాల్సిన పనిలేదని, ఎవరి పరిస్థితి విషమంగా లేదన్నారు.



కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఇలా మూర్చతో పడిపోవడంతో గడగడా వణికిపోతున్నారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 80మంది వరకు సృహ తప్పి కిందపడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి ఆళ్లనాని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.



ఏలూరులో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.. పారిశుద్ధ్య పనులు సరిగా నిర్వహించకపోవడంతోనే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితమే దక్షిణపు వీధిలో ఫిట్స్‌తో ఓ చిన్నారి ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత నుంచి ఒక్కొక్కరిగా ఆస్పత్రి పాలవుతున్నారు. పడమర వీధి, కొబ్బరితోట, గన్ బజార్‌, శనివారపుపేటలో బాధితుల సంఖ్య పెరుగుతోంది.